కరోనా రోజురోజుకు దేశవ్యాప్తంగా కోరలు చాస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇక సినీ పరిశ్రమలో కోవిడ్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీంతో పలు షూటింగ్‌లు వాయిదా పడగా.. మరికొన్ని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరిమిత సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ‍్యంలో మోడల్, టీవీ నటి ఎరికా ఫెర్నాండేజ్ ఈ ఆందోళకర పరిస్థితుల్లో సైతం పని చేయాల్సిన అవసరం ఉందటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన ఆన్‌లైన్ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఏం జరిగినా చివరకు మనం పని చేయాల్సిందే. ఎందుకంటే మన కుటుంబాలను పోషించుకునే బాధ్యత మనపై ఉంది. దీనికంటే మనకు వేరే దారి లేదు. నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను పనిచేయాల్సిందే. ఇది కేవలం విలువల కోసం కాదు.. పని అంటే పని అంతే. ఒకవేళ నేను నటిని కాకుండా ఏదైనా ఆఫీసులో ఉద్యోగిని కూడా అది కూడా చేయాలి కదా. నా ఫ్యామిలీని పోషించుకోవాల్సిన అవసరం నాకుంది. అంతేకాదు ఈ బాధ్యతల నుంచి ఎవరూ, ఎవరిని కూడా భర్తీ చేయలేరు. అలాంటప్పడు మనం ఎంతకాలమని పని లేకుండా ఇంట్లోనే ఉండగలం. ఇప్పటికే 8 నెలలుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను.
ఇంకేంతకాలం ఇలాగే ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్లి పని చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే కోరోనా వల్ల ఇలాగే ఇంకొంతకాలం పని లేకుండా ఉంటే తిండిలేక ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావొచ్చంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బయటకు వెళితే కరోనాతో.. ఇంట్లో ఉంటే ఆకలితో పోరాడాల్సిందేనని ఎరికా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ‘కసౌజీ జిందగీ కే 2’ సీరియల్ నిలిపివేయడంపై ఆమె మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించొచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేము. ఈ కారణం వల్లే ప్రాజెక్ట్‌ను నిలిపివేశారని అనుకుంటున్న’ అని ఎరికా పేర్కొంది. కాగా ఆమె పలు హిందీలో సీరియల్స్‌తో పాటు తెలుగులో ‘గాలి పటం’, ‘డేగ’ వంటి సినిమాలు, కన్నడ, తమిళం మూవీస్‌లో సైతం నటించింది.
Comments
Please login to add a commentAdd a comment