వినోద రంగంలో సెంటిమెంట్లు, జాతకాలు, గుడ్డి నమ్మకాలకు విలువెక్కువ. ప్రతిభ కన్నా అదృష్టానికి గౌరవం ఎక్కువ. అందుకే ఆ ప్రభావం ప్రొడ్యూసర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీస్.. వాళ్ల నమ్మకాలను పట్టుకొచ్చాం ఈ శీర్షిక కోసం..
అసౌకర్యం కాదు అదృష్టం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఆరువేళ్ల అందగాడు హృతిక్ రోషన్ ఒక చేతికున్న ఆ ఆరోవేలుతో చాలా అసౌకర్యంగా ఉన్నా.. భరిస్తూ ఉంటాడు. ‘అంత భరించాల్సిన అవసరం లేదు భై.. సర్జరీతో సిక్త్ ఫింగర్‌ను తీసేయొచ్చు..’ అని డాక్టర్లు సూచించినా.. ససేమిరా అన్నాడట ఆ హీరో. కారణం.. అతనింట్లో పెద్దవాళ్లు ‘ఆ ఆరోవేలే నీ అదృష్టం’ అని సెలవిచ్చారట. సో.. అదలా కంటిన్యూ అవుతోందన్నమాట. అతని చేతికి ఆ ఆరోవేలు కనిపించినంత కాలం ఆ అంధవిశ్వాసాన్ని ఆ హీరో ఫాలో అవుతున్నట్టే అని అభిమానులు ఫిక్స్ అయ్యారట కూడా.
‘కె’ క్వీన్
టెలివిజన్ డ్రామా క్వీన్.. ఏక్తా కపూర్ విజయ రహస్యమేంటనుకుంటున్నారూ.. సాస్, బహూ సీరియల్స్ అనా? కాదు.. కానే కాదు.. ‘కె’ వర్డ్ .. సీక్రెట్ ఆఫ్ హర్ సక్సెస్. ఒక్కసారి ఆ సీరియల్స్‌ను గుర్తు తెచ్చుకోండి.. క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, కుమ్‌కుమ్ భాగ్య, కుండలి భాగ్య, కసౌటీ జిందగీ కే, కసమ్, కసమ్ సే, కలశ్ ఏక్ విశ్వాస్, కవచ్, కస్తూరీ ఎట్‌సెట్రా.. అన్నీ ఇంగ్లిష్ ‘కె’ వర్డ్ లేదా హిందీ ‘క’ పదంతో మొదలైనవే. ఒకవేళ తొలి అక్షరం ‘కె’ తో స్టార్ట్ అవకపోయినా సీరియల్ టైటిల్‌లో ఎక్కడైనా ‘కె’ ఉండేట్టు చూసుకుంటుందట ఏక్తా. ‘నా పర్యవేక్షణలో ఉండే సీరియల్స్ టైటిల్స్ విషయంలో నాకు ఈ కె సెంట్‌మెంట్ ఉన్న మాట నిజమే. అయితే చాలా మంది దాన్ని మూఢ నమ్మకం అంటారు. కానీ నాకైతే అది ఒక నమ్మకం. ఎవరేమనుకున్నా నేనేం ఫీలవను’ అంటుంది ఏక్తా కపూర్.
అవుటాఫ్ కంట్రీ..|
హీరో అక్షయ్ కుమార్‌కు.. ప్రాక్టికల్ మ్యాన్ అని కితాబు బాలీవుడ్‌లో. కానీ తన సినిమా విడుదల సమయం ఆసన్నమయ్యే సరికి సెంటిమెంటల్ ఫూల్‌లా వ్యవహరిస్తాడనీ కామెంట్.. అదే ఇండస్ట్రీలో. తన సినిమా రిలీజ్ అప్పుడు తాను ఇండియాలో ఉంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టదని భయమట అతనికి. అందుకే రిలీజ్ డేట్ డిసైడ్ కాగానే విదేశానికి టికెట్ కన్‌ఫర్మ్ చేసుకుంటాడు. అలా సినిమా రిలీజ్‌కు తను దేశంలో లేనప్పుడల్లా ఆ సినిమా కమర్షియల్‌గా సూపర్ డూపర్ హిట్ అవడం.. ఇక్కడే ఉంటే ఫట్ అవడం.. అతనిలో ఆ సెంట్‌మెంట్ బలపడ్డానికి కారణమట. హే..వి..టో!!
సిల్లీ...
శిల్పా శెట్టి నటే కాదు ఐపీఎల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా క్షణం తీరికలేని షెడ్యూల్స్‌ను హ్యాండిల్ చేసినప్పుడు ఆమెకు ఎలాంటి నమ్మకాలుండేవో కానీ రాజస్థాన్ రాయల్స్‌కు యజమాని అయింతర్వాత మాత్రం సిల్లీ (అని ఆమే అంటుంది) సెంటిమెంట్లను ఫాలో అవుతోందట. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.. ‘ ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లేప్పుడు మరచిపోయి రెండు వాచ్‌లు పెట్టుకెళ్లాను. అప్పుడు మా జట్టే గెలిచింది. ఇంకోసారి మా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్‌డ్‌గా కూర్చోని.. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌కి రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను.. అప్పుడూ మా టీమే గెలిచింది. తర్వాత ఒకట్రెండు మ్యాచ్‌లకూ అలాగే రెండ్ వాచ్‌లు పెట్టుకెళ్లడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం.. ఆ మ్యాచ్‌లూ గెలవడంతో ఆ అలవాట్లను సెంటిమెంట్లుగా మార్చేసుకున్నాను. సిల్లీనే.. కానీ సెంట్‌మెంట్ ఈజ్ సెంట్‌మెంట్ కదా..’ అంటూ కనుబొమలు ఎగరేస్తూ .. పళ్లు కనపడకుండా నవ్వుతుంది శిల్పా శెట్టి.
Comments
Please login to add a commentAdd a comment