
తమిళ సినిమా: గౌతమ్ కార్తీక్ ఇటీవలే నటి మంజిమా మోహన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. తాజాగా నటుడిగా మరో మైలురాయిని కూడా టచ్ చేశారు. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడిగా 2012లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. అలా నటుడిగా 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ తాజాగా నటిస్తున్న క్రిమినల్ చిత్ర షూటింగ్‌లో యూనిట్ వర్గాలు కేక్ కట్ చేసి వేడుకలు చేశారు.
ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తనపై నమ్మకంతో మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు మణిరత్నంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఈ సినీ ప్రయాణం ఉత్సాహంగానూ, ఉన్నతంగానూ, భయంగానూ, చాలెంజ్ గానూ, అద్భుతంగానూ, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా ఉందన్నారు. నటుడిగా విజయాలు, అపజయాలు ఇచ్చిన అనుభవంతో ఇకపై మంచి చిత్రాలతో అలస్తారని గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన 1947, పత్తుతల, క్రిమినల్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment