వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రాలతో పాటు యాక్షన్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ దిట్ట. కోలివుడ్‌లో మిన్నలే చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన వెందు తనిందదు కాడు చిత్రం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని సుదీర్ఘకాలం తర్వాత ఈనెల 24వ తేదీన తెరపైకి రానుంది. అయినప్పటికీ ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఇందులో రాధికా శరత్‌కుమార్, సిమ్రాన్, నటుడు పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా బుధవారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య సాగిన ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్ పోటీని విశ్లేషించే విధంగా ఒక టీవీ చానల్ కార్యక్రమంలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ అడిగిన పలు ప్రశ్నలకు గౌతమ్‌మీనన్ బదులిచ్చారు.
ఈ సందర్భంగా క్రికెట్ నేపథ్యంలో చిత్రం చేస్తారా..? అన్న ఆర్జే బాలాజీ ప్రశ్నకు గౌతమ్ మీనన్ బదులిస్తూ ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నానని, అందుకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లేల మధ్య స్నేహం ఇతివృత్తంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. వారు క్రికెట్ క్రీడాకారులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా చేరుకున్నారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించే హీరోలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment