ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమాలకు కథలు ఎలా వస్తాయి అనుకుంటే మనలో నుండే. సాధారణ మనుషుల నుండి అసా ధారణ చరిత్రకారుల జీవన విధానమే మన సినిమా కథలకు మూలం. ముఖ్యంగా నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ విషయాలను కూడా వెండితెర మీద అసాధారణ రీతిలో ప్రతిబింబిస్తున్నారు మన వర్ధమాన దర్శకులు. ఆ కోవలో రిలీజైన సినిమానే బ్లెస్సీ దర్శకత్వం వహించిన ‘ఆడుజీవితం’. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి.
కథ కన్నా ముందు కథానాయకుడి గురించి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా సినిమాపాత్రలో ఒదిగిపోవడానికి సాధ్యమైనంత వరకు ఆపాత్రను ఆపాదించుకుంటారు. కాని ఈ సినిమా కథానాయకుడు పృథ్వీరాజ్ ఈపాత్రకు ప్రా ణం పోశాడు. కథాపరంగా కథానాయకుడు తన స్నేహితుడితో గల్ఫ్ ఎయిర్‌పోర్టులో దిగుతాడు. వాళ్ళిద్దరూ జీవనోపాధి కోసం ఓ ఏజెంట్ ద్వారా విదేశాలకు వెళతారు.
అక్కడి భాష రాకపోవడం వల్ల ఒకడి మోసంతో ఇద్దరూ విడిపోయి ఎడారిలో పని వాళ్ళుగా మారి దుర్భర స్థితిలో మిగిలిపోతారు. తినడానికి తిండి లేక అతి హీన స్థితిలో అక్కడి నుండి తిరిగి ఎలా ఇండియా వస్తారు అన్నదే సినిమా. ముఖ్యంగా పృథ్వీరాజ్ ఈ సినిమాలో చూపించిన బాడీ ట్రాన్సఫర్‌మేషన్ సినిమా మొత్తానికి హైలైట్. కాస్త నిడివి ఎక్కువున్నా పృథ్వీరాజ్ తన నటనతో తనతోపాటు మనల్ని తీసుకువెళతాడు.
సినిమా అంటే వినోదమే కాదు, వాస్తవానికి ప్రతీక అనేదానికి ఇదో మచ్చు తునక. సినిమాకి కథే కాదు సరైన కథానాయకుడు... ఇంకా సరిగ్గా చెప్పాలంటేపాత్రకి ప్రాణం పోసేపాత్రధారి దొరికినప్పుడు సినిమాని చూసినట్లుండదు, జీవితాన్ని చూసినట్లుంటుంది.
మరి ఆ జీవితం చూడాలంటే హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆడుజీవితం’ చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment