టైటిల్: ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)
నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్, అజ్మల్, వైభవ్ తదితరులు
నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్
తెలుగు విడుదల: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: వెంకట్ ప్రభు
సంగీతం: యువన్ శంకర్ రాజా
విడుదల తేది: సెప్టెంబర్ 5, 2024
దళపతి విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన చివరి సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరగడంతో ‘ది గోట్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్‌లో చూపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.
అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం, విజయ్ చివరి చిత్రమని ప్రచారం జరగడంతో తమిళ్‌లో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్‌కి ముందు తెలుగులోనూ విజయ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో తీసిన సీన్స్ ట్రైలర్‌లో చూపించడం..వాటిపై ట్రోల్స్ రావడంతో తెలుగులో పెద్ద అంచనాలు లేకుండానే సినిమా రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే..విడుదల తర్వాత వెంకట్ ప్రభు చేసిన డీ ఏజింగ్ కాన్సెప్ట్ పక్కా ట్రోల్ అవుతుందని అంతా భావించారు. కానీ ట్రోలర్స్‌కి వెంకట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జూనియర్ విజయ్ పాత్రను చక్కగా రాసుకోవడమే కాదు.. తెరపై అంతే చక్కగా చూపించాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు.
ఇక కథ విషయానికొస్తే మాత్రం.. ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో ఓ సీక్రెట్ ఏజెన్సీలో పని చేయడం..అతని పని వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రావడం..సొంత మనుషులే నమ్మక ద్రోహం చేయడం.. చివరికి హీరో అసలు విషయాన్ని కనిపెట్టి శత్రువుని ముట్టుపెట్టడం..ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వంపై కూడా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ‘ది గోట్’ సినిమాను తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. రొటీన్ కథే అయినా తనదైన స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. కావాల్సిన చోట హీరోకి ఎలివేషన్ ఇస్తూ విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్‌లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్‌లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ సీన్ బోర్ కొట్టదు. ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజీని, ధోనీ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నాడు. ఊహకందేలా కథనం సాగడం, ట్విస్టులు కూడా ముందే తెలిసేలా ఉండడంతో పాటు నిడివి కూడా ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్.
ఎవరెలా చేశారంటే..
విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిజం ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ది గోట్‌లో స్పెషల్ ఏంటంటే విజయ్‌లోని విలనిజాన్ని చూడొచ్చు. గాంధీగా హీరోయిజాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూనే.. జీవన్ అలియాస్ సంజయ్‌గా అద్భుతమైన విలనిజాన్ని తెరపై పండించాడు. హీరోగా కంటే విలన్‌గా విజయ్ చేసిన కొన్ని సీన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి.
స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పనిచేసే ఆఫీసర్స్‌గా ప్రశాంత్, ప్రభుదేవా, ఆజ్మల్ , జయ రామ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో భార్య అనుగా స్నేహ చక్కగా నటించింది. మీనాక్షి చౌదరి తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్‌ని తెరపై చూపించడం ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెరపై కనిపించేంది కొన్ని క్షణాలే అయినా.. సందడిగా అనిపిస్తుంది.
సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్‌గా ఉంది. పాటలు ఆకట్టుకోకపోవడమే కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. బీజీఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఏఐ టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment