‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో పాడి శ్రీధరన్
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఒక్క ఛాన్స్.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే యువత జపించే మంత్రమిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ రంగంలో రాణించడం కష్టం. తెరమీద మెరవాలంటే కటౌట్ అదిరిపోవాలి. అయితే లక్ష్య సాధనతో శ్రమిస్తే అదృష్టం వెన్నంటే వస్తుందని నిరూపించాడు గుంతకల్లుకు చెందిన పాడి శ్రీధరన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడిన శ్రమ చివరకు అతన్ని హీరోగా మార్చేసింది. ఎస్‌డీవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘రచ్చ రచ్చ’ సినిమాలో శ్రీధరన్, మాధురి జంటగా నటించారు. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది.
చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి
కుటుంబ నేపథ్యం...
గుంతకల్లు లోని హెచ్‌పీసీ డిపో ప్రాంతానికి చెందిన పాడి వెంకటేశులు, పాడి లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పాడి శ్రీధరన్ 1990లో జన్మించారు. అనారోగ్యం కారణంగా 1996లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి శ్రీధరన్ బరువు బాధ్యతలన్నీ అన్న కిరణ్‌బాబునే చూసుకునేవారు. శ్రీధరన్‌కు అన్నతో పాటు ముగ్గురు అక్కలూ ఉన్నారు. గుంతకల్లులోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి వరకు, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, శ్రీశంకరానందలో డిగ్రీ, హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. అన్నావదినలే తల్లిదండ్రులు లేని లోటును తీర్చి బాగా చదివించారు.
సినిమాలంటే మక్కువ..
శ్రీధరన్ తండ్రి వెంకటేశులు ప్రముఖ రంగస్థల నటుడు. తండ్రి స్ఫూర్తితో తానూ నటుడిగా రాణించాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేశాక సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తానంటూ సినీ పరిశ్రమలోని దర్శకుల చుట్టూ తిరిగారు. 2014లో తొలిసారిగా ‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం లయన్, డిక్టేటర్, జిల్, చుట్టాలబ్బాయి తదితర సినిమాల్లో సైడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2021లో ఓటీటీ ద్వారా ప్రదర్శింపబడిన ‘మరణ శ్వాస’ సినిమాలో హీరోగా అరంగ్రేటం చేశారు.
సెలబ్రెటీగా ఎదగాలన్నదే నా లక్ష్యం..
సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. రంగస్థల నటుడిగా మా నాన్న చాలా నాటికల్లో నటించారు. 2014లో మొట్టమొదటి సారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. వెండితెరపై వెలగాలన్న నా కలను నిజం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నటనలో నా ప్రతిభను గుర్తించిన ఎస్‌డీవీ క్రియేషన్స్ వారు రచ్చ రచ్చ సినిమా ద్వారా హీరోగా అవకాశమిచ్చారు. నిర్మాతలు... దర్శకుల సహకారం, ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మంచి సినిమాల్లో నటించి ఒక సెలబ్రెటీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
– పాడి శ్రీధరన్, సినీ హీరో
Comments
Please login to add a commentAdd a comment