రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది.
అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్‌తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
(ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!)
శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment