జోడీ రిటర్న్స్‌ | Hero and heroine repeated combination comes in Tollywood | Sakshi
Sakshi News home page

జోడీ రిటర్న్స్‌

Published Fri, Apr 26 2024 6:05 AM | Last Updated on Fri, Apr 26 2024 6:05 AM

Hero and heroine repeated combination comes in Tollywood

కొన్ని జంటలు ‘హిట్‌’ అవుతాయి. వెండితెరపై హిట్‌ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్‌ సెట్‌ అవ్వాలి. ఈ రెండూ సెట్‌ అయి, వెంటనే రిపీట్‌ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్‌ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్‌ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.

విశ్వంభర పిలిచాడు 
దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్‌’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్‌ సెంటిమెంట్‌తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌లో ఇంట్రవెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ 2025 జనవరి 10న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. 

షష్ఠిపూర్తి సంబరం 
రాజేంద్రప్రసాద్‌–అర్చన కలిసి నటించిన ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్‌ లీడ్‌ రోల్స్‌లో, ‘కాంతార’ ఫేమ్‌ అచ్యుత్‌ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే  ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్‌ నిర్మిస్తున్నారు.  

తెరపై యాభైఆరోసారి... 
మలయాళ సిల్వర్‌ స్క్రీన్‌పై మోహన్‌లాల్, శోభనల జోడీ సూపర్‌ హిట్‌. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్‌’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్‌లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్‌ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు మోహన్‌లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్‌ కొంబాట్‌’ తర్వాత మరోసారి మోహన్‌లాల్, శోభన కలిసి లీడ్‌ రోల్స్‌లో నటించలేదు.

ప్రస్తుతం మోహన్‌లాల్‌ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్‌ రోల్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది మోహన్‌లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారని టాక్‌. ఈ ఏడాది ఓనమ్‌కు సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. 

పెళ్లి తర్వాత తొలి సినిమా? 
దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌’ (1999)లో తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్‌ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్‌’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్‌ లైఫ్‌ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్‌’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్‌’, ‘బెంగళూరు డేస్‌’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్‌ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. 

ఇంకా మరికొందరి హీరో హీరోయిన్‌ జోడీలు రిపీట్‌ అయ్యే చాన్సెస్‌ ఉన్నాయని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement