తమిళసినిమా: నటుడు కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. నటి రాశిఖన్నా, నటి రజీషా విజయన్ హీరోయిన్లుగానూ.. నటి లైలా ముఖ్యపాత్రలోనూ నటించారు. బాలీవుడ్ నటుడు సంఘీపాండే కీలకపాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న కార్తీ మాట్లాడుతూ దర్శకుడు మిత్రన్ ఈ చిత్రం కథ గురించి చెబుతూ 1980లో మిలిటరీలో ఓ గూఢాచారి తన టీమ్‌ను తయారు చేయాలని భావాస్తారన్నారు. అయితే మిలిటరీకి చెందిన వారిని గూఢాచారిగా తయారు చేయటం కష్టం అనిపించడంతో ఒక నటుడికి గూఢాచారిగా శిక్షణ ఇచ్చి పాకిస్తాన్‌కి పంపిస్తారన్నారు. అది ఆసక్తిగా ఉండడంతో పూర్తి కథను తయారు చేయమని ఆయనకు చెప్పానన్నారు. ఆయన స్క్రిప్ట్ పూర్తి చేసి కథలో రెండు ప్రధాన పాత్రలు ఉంటాయని చెప్పడంతో మళ్లీ ద్విపాత్రాభినయమా? అని సందేహించానన్నారు. దర్శకుడు కథకు అవసరమని చెప్పడంతో సర్దార్ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు.
కథ వినగానే పలు గూఢాచారి పాత్రలు కళ్లముందు కదలాడాయన్నారు. అందరూ నటుల జీవితాలను ఇలాంటి ఒక కథ పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. ఎంజీఆర్, శివాజీ గణేషన్, రజనీకాంత్, కమలహాసన్ కాలంలోనూ ఇలాంటి పాత్రలు కనిపించాయన్నారు. తన అన్నయ్య సూర్య కూడా అయన్ చిత్రంలో రకరకాల గెటప్‌లలో కనిపించారని గుర్తుచేశారు. సర్దార్ చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించడానికి గట్టిగానే శ్రమించాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఆ పాత్రల స్వభావానికి తగ్గట్గుగా వైవిధ్యాన్ని చూపిస్తూ నటించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు.
ఫైట్స్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయన్నారు. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రమని, అలాగని జేమ్స్‌బాండ్ చిత్రంలో మాదిరి ఇందులో బికినీలు, సిక్స్‌ప్యాక్‌లు ఉంటాయని మాత్రం అడగొద్దు అన్నారు. చిత్రంలో ప్రతి పాత్రకు నటీనటులు కరెక్ట్‌గా నప్పారని తెలిపారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చిందని కార్తీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment