మన్మథుడు హీరోయిన్ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!
నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు
తాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి.
నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారు
మీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.
(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం)
రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీ
హీరోయిన్ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అసభ్యకర వ్యాఖ్యలు
ఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.
చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment