Heroes Turned Out To Be The Villain Movie Updates - Sakshi
Sakshi News home page

వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు

Published Sat, Jul 8 2023 3:48 AM | Last Updated on Sat, Jul 8 2023 4:13 PM

Heros Turned Out to Be the Villains Movies updates - Sakshi

కథను ముందుకు తీసుకెళతాడు కథానాయకుడు (హీరో). ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడుతుంటాడు ప్రతినాయకుడు (విలన్‌). హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే నాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా కూడా నటిస్తుంటారు. ఇలా కొందరు కథానాయకులు ‘ప్రతినాయకులు’గా కనిపించడానికి రెడీ అయిన చిత్రాల గురించి తెలుసుకుందాం.

మిషన్‌.. ప్రాజెక్ట్‌ కె
రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్‌హాసన్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు కమల్‌హాసన్‌. అలాగే దర్శకులు మణిరత్నం, హెచ్‌. వినోద్‌ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు కమల్‌హాసన్‌ ఆల్రెడీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్‌. ప్రభాస్, దీపికా పదుకోన్‌ జంటగా అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘ప్రాజెక్ట్‌ కె’లో నటించడానికి కమల్‌హాసన్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్‌హాసన్‌కు కొత్తేమీ కాదు.

(ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్‌ హీరో)

‘ఇంద్రుడు–చంద్రుడు’ (కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌), ‘ఇండియన్‌’, ‘ఆళవందాన్‌’ (తెలుగులో ‘అభయ్‌’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్‌గా నటించి మెప్పించారు. సో.. చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌లో కమల్‌ కనిపించినట్లు అవుతుంది. మరి.. ‘ప్రాజెక్ట్‌ కె’లో కమల్‌ చేస్తున్నది నెగటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టరేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌ వార్‌లో...
నాయకుడి పాత్రైనా, ప్రతి నాయకుడి పాత్రైనా ఎన్టీఆర్‌ అవలీలగా చేసేస్తుంటారు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన జై, లవ, కుశ పాత్రల్లో జై విలన్‌ క్యారెక్టర్‌ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్‌ 2’లో చేసేందుకు ఎన్టీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన హిందీ హిట్‌ స్పై థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘వార్‌’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

‘వార్‌’లో హీరోగా నటించిన హృతిక్‌ రోషనే సీక్వెల్‌లోనూ హీరోగా నటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఓ లీడ్‌ రోల్‌  చేయనున్నారు. ఎన్టీఆర్‌ పాత్రకు కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని బాలీవుడ్‌ సమాచారం. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు.
 

రాక్షస రాజు
హీరో, విలన్, గెస్ట్‌ రోల్‌.. ఇలా ఏ పాత్రలో అయినా రానా అదుర్స్‌. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా విలనిజమ్‌ పండించారు రానా. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోగా నటించిన రానా క్యారెక్టర్‌లో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ కనిపిస్తాయి. ఈ సినిమాకు తేజ దర్శకుడు. కాగా రానా, తేజ కాంబినేషన్‌లోనే ‘రాక్షస రాజు’ అనే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కనుంది. గోపీనాథ్‌ ఆచంట నిర్మిస్తారు.

టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌లో కాస్త నెగటివ్‌ టచ్‌ ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హిరణ్య కశ్యప’, మిలింద్‌ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో రానా హీరోగా నటిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.
 
 కొత్త ఇన్నింగ్స్‌
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత హీరోగా వెండితెరపై కనిపించలేదు మంచు మనోజ్‌. ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంలో మనోజ్‌ హీరోగా నటిస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో విశాల్, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట మనోజ్‌. రవితేజ హీరోగా ‘కలర్‌ఫోటో’ ఫేమ్‌ సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఇందులో విశ్వక్‌ సేన్‌ కీలక పాత్రలో, మంచు మనోజ్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించ నున్నారని టాక్‌. మరి.. ప్రతినాయకుడి పాత్ర పరంగా మంచు మనోజ్‌ కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.

 

లంకల రత్న?
‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్‌ ఉండదు, వైట్‌ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అన్నది విశ్వక్‌ సేన్‌  తాజా చిత్రంలోని డైలాగ్‌. దీన్నిబట్టి ఈ చిత్రంలో విశ్వక్‌ క్యారెక్టరైజేషన్‌లో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా స్టార్టింగ్‌ సమయంలో మాస్‌ కా దాస్‌ బ్యాడ్‌గా మారాడు అంటూ చిత్ర యూనిట్‌ నుంచి వినిపించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది.

ఈ సినిమాకు ‘లంకల రత్న’ టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ముగిసినట్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రిమోట్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు శుక్రవారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్‌ సేన్‌.
వీరే కాదు.. ఒకవైపు నాయకులుగా నటిస్తూ మరోవైపు ప్రతినాయకులుగానూ నటిస్తున్న హీరోలు ఇంకొందరు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement