‘‘ఈ ఏడాది నేను సంగీతం అందించిన ‘ఖుషి’, ‘స్పార్క్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ రాబోతోంది. ప్రతి సినిమా నాకో పరీక్ష.. ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్.. ఇక సంగీత దర్శకుడిగా ‘హాయ్ నాన్న’ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తోడ్పడింది’’ అన్నారు హేషమ్ అబ్దుల్ వహాబ్. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా శ్రుతీహాసన్, బాల నటి కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో హేషమ్ అబ్దుల్ వాహబ్ చెప్పిన విశేషాలు.
ఇటీవల నేను సంగీతం అందించిన సినిమాల్లో ప్రేమకథలే ఎక్కువ. అబ్బాయి, అమ్మాయిల మధ్య ఉండే ప్రేమకథలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఆ కథను దర్శకుడు ఎంత కొత్తగా చూపించారు? అన్నది ముఖ్యం. అలాగే ప్రేమ పాటలు కూడా. ఆ పాటలను ఎవరు పాడారు? ఏ సందర్భంలో పాడారు? ఎలాంటి సాహిత్యం ఉంది? అన్న అంశాలతో కొత్త క్రియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ చాలా అప్‌డేటెడ్‌గా ఉంటున్నారు.
నా మలయాళ సినిమా ‘హృదయం’లోని ‘దర్శన..’, ‘హాయ్ నాన్న’లోని ‘సమయమా..’ పాటలకు శ్రోతలు పోలిక పెడుతున్నారు. అయితే ‘దర్శన..’ కంటే ‘సమయమా..’లో క్లాసిక్ కంపోజిషన్ ఎక్కువగా ఉంటుంది. అయినా.. ఈ రెండు పాటలు నావే. రెండూ వైరల్ అయ్యాయి (నవ్వుతూ). ∙‘హాయ్ నాన్న’ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం. ‘సమయమా’.., ‘గాజుబొమ్మ’, ‘అమ్మాడి..’ ఇలా సినిమాలోని ప్రతి పాటకూ ప్రాముఖ్యత ఉంది. కథలో ఓ పెద్ద పార్టీలో భాగంగా ‘ఓడియమ్మ..’ పాట వస్తుంది. ఈ పాటలను శౌర్యువ్ ఆవిష్కరించిన తీరు నన్ను సర్‌ప్రైజ్ చేసింది.
దాదాపు 40 రోజుల పాటు 15 మంది మ్యుజిషియన్స్‌తో హైదరాబాద్‌లోనే ‘హాయ్ నాన్న’ కోసం పని చేశాం. మరో 20 మందికి పైగా మ్యూజిక్ ప్లేయర్స్ పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. అలాగే ఆర్‌ఆర్ కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వాడాం. ఈ తరహాలో ఆర్‌ఆర్ చేసిన తొలి ఇండియన్ సినిమా ‘హాయ్ నాన్న’ కావొచ్చేమో. ప్రస్తుతం తెలుగులో రష్మికా మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’, శర్వానంద్‌గారి సినిమాలకు సంగీతం అందిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment