ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కిడ్నాప్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడే తత్వం తల్లిది అన్న విషయాన్ని సూటిగా చూపించిన ఆంగ్ల చిత్రం ‘కిడ్నాప్’. 2017లో లూయి ప్రీటో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. హాలీవుడ్ ప్రముఖ కథానాయిక హేలీ బెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లిష్), లయన్స్ గేట్ (తెలుగు వెర్షన్) ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. తల్లిగా ఆమె నటన ఈ సినిమా మొత్తానికే హైలైట్.
కథాంశానికొస్తే... కార్లా డైసన్ ఓ సింగిల్ మదర్. తన ఆరేళ్ల కొడుకు ఫ్రాంకీని కార్నివాల్‌కు తీసుకువెళ్ళడంతో ‘కిడ్నాప్’ సినిమా మొదలవుతుంది. కార్నివాల్‌లో అనుకోకుండా పార్కింగ్ లాట్ నుండి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లడం చూస్తుంది కార్లా. ఇక అక్కడి నుండి ఆ కిడ్నాపర్ల వెంటపడి తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది అన్నదే మిగతా కథ. ఈ సినిమా స్క్రీన్‌ప్లే దాదాపు రోడ్డు మార్గానే నడుస్తుంది. అమెరికా రోడ్లలో పరిమితికి మించి వేగంగా కొంతమంది కార్లు నడుపుతూ ఉంటారు. అంతకు మించి వేగంగా ఈ కథ స్క్రీన్‌ప్లే ఉంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఈ సినిమా మొదలయ్యాక శుభం కార్డు పడే వరకు లేవరు. సినిమాను అంత ఆసక్తికరంగా దర్శకుడు లూయీ రూపొందించారనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు.
ప్రఖ్యాత సంస్థ అయిన ఎఫ్‌బీఐ ఇచ్చిన అంచనాల మేరకు అమెరికాలో ఏటా 8 లక్షలకు పైబడి ప్రతి 40 సెకన్లకు ఓ బిడ్డ కనిపించకుండాపోతున్న పరిస్థితి ఉంది. మనందరినీ మనకి తెలిసీ తెలియకుండా నిరంతరం కాపాడే అమ్మ ఆ విజయదుర్గ. ఆ తల్లి తత్వంతో తీసిన ఈ సినిమా నిజంగా అద్భుతం. విజయదశమి పండగ సమయంలో థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లకి ఇదో మంచి చాయిస్.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment