
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదినాన్ని ఆయన అభిమానులు సోమవారం కోలాహలంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే పెద్దఎత్తున అభిమానులు, స్థానికులు రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ 2002లో కథా, కథనం సమకూర్చి కథానాయకుడిగా నటించి నిర్మించిన బాబా చిత్రం పలు మార్పులు చేర్పులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ అయ్యి అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. కాగా స్థానిక క్రోంపేటలోని బాబా చిత్రం ప్రదర్శింపబడుతున్న వెట్రి థియేటర్లో అభిమానులు ఆదివారం రాత్రి రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.'
ఈ వేడుకలో రజనీకాంత్ సతీమణి లత రజినీకాంత్ పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి.. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే మొట్ట మొదటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అందడం విశేషం. ఆయన మీడియా ద్వారా రజనీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.
అలాగే అగ్ర నటుడు కమలహాసన్ కూడా రజనీకాంత్‌కు విషెస్ చెప్పారు. తన మిత్రుడు సంపూర్ణ ఆరోగ్యంతో తన విజయ ప్రయాణాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని కమల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ తాజాగా నటిస్తున్న జైలర్ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయాన్ని ప్రకటించడం అభిమానుల్లో జోష్ నింపింది.
Comments
Please login to add a commentAdd a comment