తాతకు తగ్గ మనవడు.. యంగ్ టైగర్.. టీనేజీలోనే హిట్స్ కొట్టి బాక్సాఫీస్ షేక్ చేసిన హీరో.. నందమూరి మూడో తరానికి టార్చ్ బేరర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. పదాలు-వాక్యాలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా హీరోలంటే డ్యాన్స్ చేస్తే యాక్టింగ్‌లో తడబడతుంటారు. యాక్టింగ్ బాగా చేస్తే.. డ్యాన్స్‌లో ఇబ్బంది పడతారు.
ఈ రెండు ఉన్నా సరే బయట సరిగా మాట‍్లాలేకపోతుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అభిమానుల్ని సంతృప్తి పరుస్తూ సినిమాలు చేస్తుండాలి. మనోడు మాత్రం ఈ విషయాలన్నింట్లోనూ తోపు అని చెప్పొచ్చు. అతడే నందమూరి తారక రామారావు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు. మే 20న తారక్ బర్త్ డే. ఈ సందర్భంగా అతడి గురించే ఈ స్పెషల్ స్టోరీ..
రాకెట్‌లా దూసుకొచ్చిన ఎన్టీఆర్
NTR అనే మూడక్షరాల పేరు.. తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే ఏ మాత్రం అతిశయోక‍్తి కాదు. 1949-93 వరకు సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో హీరోగా చేసి ఇండస్ట‍్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన వారసుడిగా బాలకృష్ణ అద్భుతమైన సినిమాలు చేశారు. మూడో తరంలో ఆ స్థాయిని ఎవరు అందుకుంటారా? అని అందరూ చూస్తున్న టైంలో రాకెట్‌లా దూసుకొచ్చిన ఎన్టీఆర్.. తన మార్క్ చూపించాడు. బ్రహ‍్మర్షి విశ్వామిత్ర, రామాయణం లాంటి మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. 'నిన్ను చూడాలని' చిత్రంతో హీరోగా మారాడు. ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. కానీ జనాలు అతడిలో స్పార్క్ ని గమనించారు. ఆ తర్వాత 'స్టూడెంట్ నం.1' హిట్ అవడంతో ఎన్టీఆర్ గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ కుర్రాడు ఎవరబ్బా.. యాక్టింగ్-డ్యాన్సుల్లో ఇరగదీశాడు అని అనుకునేలా చేశాడు.
యమదొంగ కోసం సన్నబడ్డ తారక్
ఈ హిట్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత‍్రమే అని ముందు ముందు అసలు సినిమా ఉందని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు. 'ఆది'తో అసలు సిసలు మాస్ అంటే ఏంటో టాలీవుడ్‌కు రుచి చూపించాడు. తర్వాతి ఏడాదే 'సింహాద్రి' అంటూ రాజమౌళితో కలిసి మరో హిట్ కొట్టాడు. ఇలా మూడేళ్లలో వరుసగా హిట్స్ కొట్టేసరికి ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆ తర్వాత సినిమాల విషయంలో తడబడ్డాడు. ఫలితంగా నాలుగేళ్లపాటు సినిమాలైతే చేశాడు గానీ ఒక్క హిట్ లేకుండా పోయింది. మళ్లీ రాజమౌళితో చేసిన యమదొంగ.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. బొద్దుగా ఉన్న ఎన్టీఆర్, ఈ మూవీ కోసం సన్నగా మారి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి మూవీస్‌తో పాటు అటు కామెడీ, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూనే మాస్ అభిమానులను కూడా ఎంటర్ టైన్ చేశాడు.
కాలర్ ఎత్తుకునే సినిమాలు చేస్తా
బృందావనం 2010లో వస్తే.. 2015లో టెంపర్ వచ్చేవరకు ఎన్టీఆర్‌కు రాహుకాలం నడించిందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కట్లేదు. దీంతో రూట్ మార్చిన ఎన్టీఆర్.. కేవలం ఫ్యాన్స్ కోసం కాదు, ఫ్యాన్స్‌తో పాటు తనకు నచ్చే కథలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. 'టెంపర్' ఆడియో ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు కాలర్ ఎత్తుకునే మూవీస్ చేస్తానని అన్నాడు. చాలామంది దీన్ని నమ్మలేదు. కానీ రియాలిటీలో మాత్రం అదే జరిగింది. టెంపర్ తర్వాత చేసిన ప్రతి సినిమా హిట్ లేదంటే బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చాయి. గతేడాది వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని పలకరించిన ఆర్ఆర్ఆర్.. ఏ రేంజ్‌లో హిట్ అయిందో మీకు ప్రత‍్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎన్టీఆర్ గ‍్లోబల్ స్టార్ అయిపోయాడు. చెప్పాలంటే టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ప్రస్తుతం కొరటాల శివతో మూవీ చేస్తున్న తారక్.. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేస్తాడు. బాలీవుడ్ లో 'వార్-2' కూడా లైన్ లో ఉంది. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.
ప్రణతి వచ్చాకే ఎన్టీఆర్ మరింత పరిణితి
ఎన్టీఆర్ సినిమాల గురించి పక్కనబెడితే.. ఫ్యామిలీతోనూ ఎక్కువ టైమ్ స‍్పెండ్ చేస్తుంటాడు. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు భార‍్య-పిల్లలతో కలిసి టూర్స్ వేస్తుంటాడు. లక్ష్మి ప్రణతి.. ఎన్టీఆర్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అంటే 2011 తర్వాత ఎన్టీఆర్‌లో పరిణితి కనిపించింది. సినిమాల విషయమే కాదు మాట్లాడే తీరులోనూ అభిమానులకు మరింతగా నచ్చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు జానకిరామ్.. కారు యాక్సిడెంట్స్‌లో చనిపోవడం ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆర్ మర్చిపోలేని విషయం. అందుకే ఏ ఈవెంట్‌కు వెళ్లినా సరే అభిమానులు జాగ్రత్తగా ఇంటికెళ్లాలని మరీ మరీ చెబుతుంటాడు.
కారు యాక్సిడెంట్‌కు గురైన హీరో
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. అందుకే 2009 ఎన్నికల టైంలో తన వంతు బాధ్యతగా ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలో భాగంగానే అనుకోకుండా కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. మరి దీని ఎఫెక్టో ఏమో గానీ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే టీడీపీ సభల్లో అనేక సార్లు అభిమానులు మాత్రం.. ఎన్టీఆర్ గురించి అడుగుతూ చంద్రబాబుని చాలాసార్లు ఇరకాటంలో పడేశారు. ఆయనకు ఏం చెప్పాలో తెలీక తికమక పడటం కూడా మీకే తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ పూర్తి కాన్సంట‍్రేషన్ సినిమాల మీదే ఉంది. కొన్నాళ్ల ముందు అడిగితే ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ ఎన్టీఆర్ గనుక తెలుగుదేశం బాధ్యతలు తీసుకుంటే చంద్రబాబు శకం కనుమరుగయ్యే ఛాన్సుంటుంది. సో అదన‍్నమాట విషయం. ఎన‍్టీఆర్ ఇలానే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం..
Comments
Please login to add a commentAdd a comment