సాక్షి, చెన్నై: దివంగత నటుడు శివాజీ గణేషన్‌ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ప్రముఖ రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతి రాజా, కే.భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, రచయిత ముత్తులింగం, నటుడు ప్రభు, రాంకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరన్నారు. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుందన్నారు. ఒకసారి తాను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ తనను అడిగారన్నారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనువాభవాలను పంచుకునే వారని చెప్పారు. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్‌కు అభినందన సభ జరిగిందన్నారు.
ఆయనకు ఒక కానుక అందించాలని నిర్ణయించామన్నారు. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసినట్లు చెప్పారు. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజ పైనా శివాజీ గణేషన్ పేరు ఉంటుందన్నారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారన్నారు. శివాజీని సినిమా పెద్దలు గాని, ఏ ప్రభుత్వం తగిన విధంగా సత్కరించలేదని, అయితే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే అని పేర్కొన్నారు.
చదవండి:
మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా?
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
Comments
Please login to add a commentAdd a comment