షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌.. నయన్‌కు ఫస్ట్‌.. అట్లీ సెకండ్‌.. ‘జవాన్‌’విశేషాలివీ! | Interesting Facts About Shah Rukh Khan Jawan Movie | Sakshi
Sakshi News home page

Jawan Movie: షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌.. నయన్‌కు ఫస్ట్‌.. అట్లీ సెకండ్‌.. ‘జవాన్‌’విశేషాలివీ!

Published Wed, Sep 6 2023 3:25 PM | Last Updated on Thu, Sep 7 2023 6:57 AM

Interesting Facts About Shah Rukh Khan Jawan Movie - Sakshi

యావత్‌ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్‌’. ‘పఠాన్‌’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.  నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు(సెప్టెంబర్‌ 7) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా జవాన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

షారుఖ్‌ని డైరెక్ట్‌ చేసిన రెండో వ్యక్తి అట్లీ
షారుఖ్‌ ఖాన్‌ సినీ కెరీర్‌ 1992లో ప్రారంభమైంది. బాలీవుడ్‌లోని బడా డైరెక్టర్స్‌ అందరితో షారుఖ్‌ కలిసి పని చేశాడు. కానీ సౌత్‌ వాళ్లతో కలిసి పని చేయడం చాలా తక్కువ. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమిళ డైరెక్టర్‌తో కలిసి షారుఖ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. అట్లీ కంటే ముందు 2000 సంవత్సరంలో కమల్‌ హాసన్‌ దర్శకత్వంలో ‘హే రామ్‌’ అనే సినిమా చేశాడు. 

నయనతార తొలి చిత్రం
దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘జవాన్‌’. స్వతహా షారుఖ్‌ అభిమాని అయిన నయన్‌.. అతనితో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట. అంతకు ముందు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ‘వన్‌ టూ త్రీ ఫోర్‌’.. అనే పాటలో నటించే చాన్స్‌ ముందుగా నయన్‌కే వచ్చిందట. కారణం ఏంటో తెలియదు కానీ అప్పుడు ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట. నయన్‌ వద్దనడంతో ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారట. 

షారుఖ్‌ ద్విపాత్రాభినయం
‘జవాన్‌’లో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. అంతేకాదు పలు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే షారుఖ్‌ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న టాటు బాగా వైరల్‌ అయింది. షారుక్‌  గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్‌ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్‌ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. 

అతిథి పాత్రలో దీపికా పదుకొణె
చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో షారుఖ్‌కు జోడిగా నటించిన దీపికా పదుకొణె..  ‘జవాన్‌’లో అతిథి పాత్రలో మెరవబోతుంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించడంతో షారుఖ్‌, దీపికా పదుకొణెల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. షారుఖ్‌ కోసమే దీపికా అతిథి పాత్రను ఒప్పుకుందట

విలన్‌గా విజయ్‌ సేతుపతి
జవాన్‌లో విలన్‌గా విజయ్‌ సేతుపతి నటించడం మరో విశేషం. విజయ్‌కి రెండో బాలీవుడ్‌ చిత్రమిది. అంతకు ముందు ముంబైకర్‌ చిత్రంలో విజయ్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే అది ఓటీటీలో విడుదల కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ‘జవాన్‌’తో విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ భారీ విజయం అందుకోబోతున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 

షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌
‘జవాన్‌’కోసం షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌ చేశారట. ఈ చిత్రం కోసం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్‌ మాస్టర్స్‌ పని చేయడం గమనార్హం. స్పిరో రజటొస్‌, యనిక్‌ బెన్‌, ట్రెయిన్‌ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్‌ అరసు మొదలగు ఆరుగురు ఫైట్‌ మాస్టర్స్‌ కంపోజ్‌ చేసిన పోరాట దృశ్యాలు, బైక్‌, కారు ఛేజింగ్స్‌ జవాన్‌ చిత్రంలో హైలెట్‌ కానున్నాయని యూనిట్‌ సభ్యులు తెలిపాయి.

రూ.300 కోట్ల బడ్జెట్‌
జవాన్‌ బడ్జెట్‌ దాదాపు రూ.300 కోట్లు. ఇందులో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్‌ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట. తొలి బాలీవుడ్‌ చిత్రానికిగాను రూ. 11 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్‌ ముంబై, పుణె, చెన్నై, రాజస్తాన్‌, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాల్లో జరిగింది.

రన్‌ టైం ఎంత?
జవాన్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది. రన్‌టైం 2:49 గంటలు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌  ఓపెన్‌ కాగా.. కొన్ని గంటల్లోనే తొలిరోజు షోకి సంబంధించి సుమారు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. బాలీవుడ్‌ చరిత్రలో ఇదొక రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement