‘‘నేను తీసిన ‘హృదయ కాలేయం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేశాడు రాకేష్. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన తనకి కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. త్వరలోనే ఆపాత్ర రాసి రుణం తీర్చుకుంటాను. ‘కేసీఆర్’ సినిమా ట్రైలర్ బావుంది. సినిమా విజయం సాధించి, రాకేష్ మంచి స్థాయికి వెళ్లాలి’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు.
రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘కేసీఆర్’కి నేను దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా అందించాను. రాకేష్ అద్భుతమైన కథ రాశారు’’ అని ‘గరుడవేగ’ అంజి చెప్పారు. నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘కొన్ని డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ‘కేసీఆర్’లాంటి ఒక మంచి సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment