టైటిల్: జైలర్
నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటర్: ఆర్.నిర్మల్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
విడుదల తేది: 2023 ఆగస్టు 10
'జైలర్' కథేంటి?
ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ముత్తు అదేనండి రజినీకాంత్.. విలన్ డెన్‌లోకి వెళ్లి, అతడికి వార్నింగ్ ఇస్తాడు. స్టైల్‌గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు. ఇంటర్‌కట్‌లో మరో రెండు చోట్ల శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కూడా అదే టైంకి సిగరెట్స్ స్టైల్‌గా వెలిగిస్తారు. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇదంతా చెప్పడానికి చాలా నార్మల్‌గా ఉన్నాసరే.. స్క్రీన్‌పై ఈ సీన్ చూస్తున్నప్పుడు మీరు రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి.
ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), అతడి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఏడిపిస్తుంటాడు. కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం.. పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే మంచి హై ఇస్తుంది.
ఇంటర్వెల్ వరకు రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం గందరగోళానికి గురిచేశాడు. అప్పటివరకు ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో ఎటెటో పోతుంది. అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. ఫైనల్లీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్, ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప ఇంకేం లేదు!
డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అయిన నెల్సన్.. 'జైలర్' విషయంలోనూ అదే ఫార్ములా పాటించాడు. ఫస్టాప్‌లో రజినీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ పై కనిపించే యాక్టర్స్ అందరూ సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. మనకు మాత్రం నవ్వొస్తుంటుంది. అదే 'జైలర్'లో మ్యాజిక్.
ఎవరెలా చేశారంటే?
'జైలర్'లో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస‍్తూ ఎంటర్‌టైన్ చేశారు. ఆయనకు ఇలాంటివన్నీ కొత్తేం కాదుగా! తన మార్క్ మేనరిజమ్స్‌తో.. విజిల్స్ వేయించే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో రజినీ యాక్టింగ్ మీకు కచ్చితంగా హై ఇస్తుంది. రజినీకి భార్యగా రమ‍్యకృష్ణ హుందాగా నటించింది. కొడుకు అర్జున్‌గా వసంత్ రవి డిఫరెంట్ పాత్రలో ఓకే అనిపించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ నిడివి చాలా తక్కువ. కానీ ఉన్నంతలో వీళ్లకు ఎలివేషన్స్ బాగా పడ్డాయి.
విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్ బాగానే చేశాడు. కానీ అతడు పాత్రలో తమిళ నేటివిటి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. సునీల్ ఇందులో బ్లాస్ మోహన్ అనే సినిమా హీరో పాత్రలో నటించాడు. కానీ ఇతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. తమన్నా.. ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. యోగిబాబు, వీటీవీ గణేశ్ ఉన్నంతసేపు నవ్వించారు. మిగిలిన వాళ్లు తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకొస్తే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరో అని చెప్పొచ్చు. పాటల సంగతి పక్కనబెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజినీకాంత్‌ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటే నార్మల్ ఆడియెన్స్‌కి 'జైలర్' నచ్చుతుంది. రజినీకాంత్ అభిమానులకు అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది!
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment