టైటిల్: జనక అయితే గనక
నటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డి
దర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్ల
సంగీతం: విజయ్ బుల్గానిక్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
విడుదల తేది: అక్టోబర్ 12, 2024
ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.
వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment