టైటిల్: జపాన్
నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు
నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం: రాజు మురుగన్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
విడుదల తేది: నవంబర్ 10, 2023
కథేంటంటే..
జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.
ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదనే చెప్పాలి.
ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్‌గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతుంది.
దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్‌గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్‌ని పోలీసులు పెట్టే టార్చర్‌ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది.
హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్‌లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి.
ఎవరెలా చేశారంటే..
కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి.
పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్‌తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment