Kajal Aggarwal Latest Interview After Marriage | Kajal Aggarwal Reveals About Her Husband Gautam Kitchlu and Their Love Story, in Telugu - Sakshi
Sakshi News home page

కాజల్‌ అగర్వాల్‌ వెరీ వెరీ స్పెషల్‌

Published Fri, Nov 6 2020 2:33 AM | Last Updated on Fri, Nov 6 2020 12:23 PM

Kajal Aggarwal Interview with SAKSHI - Sakshi

మిత్రవింద... ‘మగధీర’లో కాజల్‌ అగర్వాల్‌ చేసిన పాత్ర పేరిది. మిత్రవింద యువరాణి. రియల్‌ లైఫ్‌లో గౌతమ్‌కి రాణి కాజల్‌. కాజల్‌ రాజు గౌతమ్‌. ‘మా గౌతమ్‌ మంచి అబ్బాయి’ అంటున్నారీ కొత్త పెళ్లి కూతురు.
ఇంకా పెళ్లి, పెళ్లి వేడుకలు, పెళ్లికి ముందు గౌతమ్‌తో అనుబంధం వంటి విషయాలన్నీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు కాజల్‌ అగర్వాల్‌.

► ‘లక్ష్మీ కల్యాణం’తో కెరీర్‌ ఆరంభించారు. కాజల్‌ కల్యాణం గౌతమ్‌తో జరిగిన క్షణాల గురించి?
కాజల్‌: చాలా స్పెషల్‌ మూమెంట్‌. ఎంతో విలువైనది కూడా. ఈ క్షణాలు నాకెప్పటికీ స్పెషల్‌గా మిగిలిపోవాలనుకున్నాను. అందుకే నా ఫోకస్‌ మొత్తం ఆ మూమెంట్‌లో పెట్టాను. నిజానికి ఇదంతా నమ్మశక్యంగా అనిపించలేదు. వెరీ వెరీ స్పెషల్‌.

► గౌతమ్‌ మీకు చాలా ఏళ్లుగా తెలుసన్నారు. మీ స్టోరీ షేర్‌ చేసుకోండి?

ఒక వ్యక్తిగా, నటిగా నా ఎదుగుదలను చూస్తూ వచ్చాడు గౌతమ్‌. నా అప్స్‌ అండ్‌ డౌన్స్‌ చూశాడు. యాక్టర్‌ కాజల్‌ కంటే కూడా తనకి సాధారణ కాజలే బాగా తెలుసు. అదే బెస్ట్‌ విషయం. మా ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉందంటే.. నా జీవితాన్ని గౌతమ్‌తో తప్ప ఎవ్వరితోనూ ఊహించుకోలేకపోయాను.

► ఇతనే ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’ అని ఏ మూమెంట్‌లో అనిపించింది?
ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం. లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం.

► అవునూ.. మీలో ఎవరు ముందుగా ప్రపోజ్‌ చేశారు?
సినిమాల్లోలా గౌతమ్‌ రొమాంటిక్‌ కాదు. సినిమాటిక్‌ ప్రపోజల్స్‌ ఏమీ లేవు. కానీ చాలా ఎమోషనల్‌ సంభాషణ అయితే జరిగింది. మన జీవితంలో నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకుందాం అని కలసి నిర్ణయించుకున్నాం.     

► గౌతమ్‌ క్వాలిటీస్‌ చెబుతారా?
చాలా మంచి అబ్బాయి. మంచి మనసు ఉన్నవాడు. అందర్నీ గౌరవిస్తాడు. అర్థం చేసుకోగలడు. ఇలాంటి అబ్బాయి నాకు దొరకడం చాలా లక్కీ అనుకుంటున్నాను.

► కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టారు..  

గృహప్రవేశం మొన్నే అయిపోయింది. నేను చాలా లక్కీ అనిపిస్తోంది. ఎందుకంటే ఇంటి  డిజైనింగ్‌ అంతా తనే చూసుకున్నాడు. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి అడుగుపెట్టాను. ఒక ‘రెడీమేడ్‌’ ఇంట్లోకి అడుగుపెట్టినట్లనిపించింది.

► పెళ్లి అంటే అత్తగారింట్లో ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ అమ్మాయిలకు ఉండటం సహజం. మీకేమైనా?
నా మైండ్‌లోనూ చాలా ఆలోచనలు రన్‌ అయ్యాయి. ‘ఎలా ఉంటుందో.. ఏంటో’ అని. కానీ మా అత్తగారి కుటుంబం చాలా స్వీట్‌. బాగా అర్థం చేసుకున్నారు. చాలా సపోర్టివ్‌.

► మీ చెల్లెలు నిషా పెళ్లి వేడుకలన్నీ దగ్గరుండి చూసుకున్నట్లున్నారు...
నా పెళ్లి ఫిక్స్‌ కాగానే నిషా చాలా ఎగ్జయిట్‌ అయింది. నాకు గౌతమ్‌ ఎన్నేళ్ల నుంచి తెలుసో తనకు కూడా అప్పటినుంచీ తెలుసు. అన్నీ దగ్గరుండి చేసింది.

► మీరు పెళ్లిలో వేసుకున్న బట్టలు, బంగారం అన్నీ ఐ ఫీస్ట్‌గా అనిపించాయి. ఎంత ఎఫర్ట్‌ పెట్టారు?
నాకు ‘స్టేట్‌మెంట్‌ పీసెస్‌’ అంటే చాలా ఇష్టం. లేత రంగులు చాలా ఇష్టం. కానీ బ్రైట్‌ కలర్స్‌ కూడా వాడాము. సింపుల్‌ డ్రెస్సులను ఇష్టపడతాను. అయితే పెళ్లి బట్టలకు ఎంబ్రాయిడరీ వర్క్‌ ఎక్కువ ఉంటుంది. అది ఉన్నా కూడా సింపుల్‌గా అనిపించేవి ఎంపిక చేసుకున్నాను.     

► మీ పెళ్లి నార్త్‌ ఇండియా సంప్రదాయం ప్రకారం జరిగింది. అందులో జీలకర్ర బెల్లం కాన్సెప్ట్‌ కూడా ఉండాలని ఎందుకు అనుకున్నారు?    
నేను తెలుగు అమ్మాయినే కదా (నవ్వుతూ). తెలుగుతో నాకు చాలా అనుబంధం ఉంది. చాలా ఏళ్లుగా ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అందుకే  నా పెళ్లిలో ఇది ఉండాలి అని ఇద్దరం అనుకుని నిర్ణయం తీసుకున్నాం. ఈ సంప్రదాయానికి నేను ఇచ్చే గౌరవం అది.

► మీ పెళ్లనగానే సోషల్‌ మీడియా మొత్తం హార్ట్‌బ్రేక్స్‌ మెసేజులతో నిండిపోయాయి. ఏమంటారు?
సోషల్‌ మీడియా చూడలేదు అసలు. చాలా బిజీగా ఉన్నాను. అయితే అంత మంది హార్ట్‌బ్రేక్‌ చేసినందుకు సారీ (నవ్వుతూ). కానీ నా ఫ్యాన్స్‌ అందరూ నాకు పెళ్లయినందుకు చాలా సంతోషపడతారని తెలుసు. వాళ్లందరూ ఎప్పుడూ నా సపోర్ట్‌ సిస్టమ్స్‌.     

► అవునూ.. పెళ్లయ్యాక పని పట్ల మీ అప్రోచ్‌ ఏమైనా మారుతుందా?

అలా ఏమీ ఉండదేమో? నేను మొదటి నుంచి మంచి పాత్రలు, మంచి సినిమాలే ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాను. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని విడివిడిగానే ఉంచాను. అవి ఎప్పుడూ అలానే ఉండాలని కూడా అనుకుంటాను. ఈ రెండిట్లో ఏదీ కూడా రెండోదాన్ని ప్రభావితం చేయకూడదు. పని చేస్తే దానికి 100 పర్సంట్‌ ఇవ్వాలి. అలాగే పర్శనల్‌ లైఫే ఫస్ట్‌ ప్రయారిటీ అవ్వాలన్నది నా అభిప్రాయం.     

► ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు?
ఆచార్య, భారతీయుడు 2, మోసగాళ్ళు, దుల్కర్‌తో సినామికా, వెబ్‌ సిరీస్‌ ‘టెలికాస్ట్‌’ ఉన్నాయి. షూటింగ్స్‌లో జాయిన్‌ అయితే చాలా అంటే చాలా బిజీ వర్క్‌ ఉంది.

► కరోనా సెకండ్‌ వేవ్‌ మళ్లీ స్టార్ట్‌ అంటున్నారు. షూటింగ్స్‌ సవ్యంగా జరుగుతాయా? అనే ఆలోచన చాలామందికి ఉంది. భయంగా ఉందా?
భయం లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్‌ చాలా చిన్నది కానీ మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్‌ మాత్రం పెద్దది. ఇది మనతో ఇంకా చాలా కాలం ఉండేలా ఉంది.

► అందుకేనా ‘ఇట్స్‌ నెవర్‌ టూ లేట్‌’ అని ఇటీవల ఓ లేఖ పంచుకున్నారు?    
అవును. కరోనాతో ఉంటూనే కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసుకుని, దాన్నుంచి రక్షించుకునే ఉత్పత్తులను వాడాలని అనుకున్నాను. అందులో భాగంగానే హిందుస్తాన్‌ యూనిలివర్‌ నేచర్‌ ప్రొటెక్ట్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను వాడటం మొదలుపెట్టాను. వేప మరియు ఇతర సహజ సిద్ధమైన వనరులతో తయారు చేయడంవల్ల అవి మనల్ని క్రిముల నుంచి రక్షిస్తాయి. తడి టిష్యూలు, ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు, బట్టల సబ్బులు, ఫ్లోర్‌ శుభ్రం చేసేవాటి దగ్గర్నుంచి పండ్లు, కూరగాయలు కడిగేవి వరకూ అన్నీ మనల్ని, మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేలా తయారు చేశారు. ఇలాంటి సమయంలో ఇలాంటివి వాడి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని నమ్మి, వెంటనే వాడటం మొదలుపెట్టాను.

► అవునూ... షూటింగ్స్‌ నిమిత్తం చాలా దేశాలు వెళ్లారు. ఇప్పుడు మీవారితో కలసి ఏ ప్లేస్‌కి వెళ్లాలనుకుంటున్నారు?
గౌతమ్‌తో కలసి ఏదైనా బ్యూటిఫుల్‌ ప్లేస్‌కి వెళ్తే బాగుంటుందనిపిస్తోంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.

► మరి హైదరాబాద్‌ ఎప్పుడు వస్తున్నారు?
త్వరలో వస్తాను. దీపావళి తర్వాత çషూటింగ్స్‌ స్టార్ట్‌ చేయబోతున్నాను.

► పెళ్లయిన వెంటనే తొలి పండగ ‘కర్వా చౌత్‌’ జరుపుకోవడం.. ఉపవాసం ఉండటం గురించి..
చాలా సంతోషంగా అనిపించింది. రోజంతా ఉపవాసం ఉండటం ఇదే తొలిసారి. ఏమీ తినలేదు. తాగలేదు కూడా. ఉదయం నాలుగింటికే ఇంట్లో అందరం నిద్రలేచాం. అత్తగారు, వదినలతో పూజ చేశాను. విశేషం ఏంటంటే.. గౌతమ్‌ కూడా నాతో పాటు ఉపవాసం ఉన్నాడు. అప్పుడే షేరింగ్‌ స్టార్ట్‌ అయింది (నవ్వుతూ).

► కోవిడ్‌ వల్ల పెళ్లి గ్రాండ్‌గా జరుపుకోలేకపోయినందుకు బాధపడ్డారా?
కొంచెం ఉంది. చాలా మంది ఫ్రెండ్స్, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కుదర్లేదు. అయితే తక్కువ మంది బంధువులతో పెళ్లి కూడా భలే ఉంది. దీని ఛార్మ్‌ దీనికి ఉంది. అదే సందడి. అదే జోష్‌. ఎమోషన్లు, సెంటిమెంట్లు అన్నీ అవే.

► మీ పెళ్లిలో ఏమేం వెరైటీలు వడ్డించారు?

హైదరాబాద్‌ బిర్యానీ తయారు చేయించాం. కాశ్మీరీ, పంజాబీ డిషెస్‌ ఎక్కువ ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌కి సౌతిండియా పెట్టాం. ఇడ్లీ, దోసె, సాంబార్‌ వంటివి. ఇటాలియన్, ఏషియన్, లెబనీస్‌ వంటకాలు తయారు చేయించాం.

► పెళ్లికి ముందు డైటింగ్‌లాంటిది ఏమైనా చేశారా?
అలాంటిది ఏమీ లేదు. నేను ఎప్పుడూ చేసేదే చేశాను. చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్‌ మాత్రమే తీసుకుంటాను. నూనె, మసాలాలకు పూర్తిగా దూరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement