కాజల్ పెళ్లి కుదిరిందట. కాజల్ నిశ్చితార్థం అయిందట. కాజల్ భర్త పేరు అదట. కాజల్ పెళ్లి చేసుకోబోయేది అక్కడట. మొన్నటి వరకూ అన్నీ అటాలే. కాజల్ ప్రకటించే వరకూ అన్నీ సీక్రెట్‌గానే ఉన్నాయి. అక్టోబర్ 6న ‘ఐ సెడ్ యస్’ అని గౌతమ్ కిచ్లుని తను పెళ్లాడబోతున్నట్లు కాజల్ చెప్పారు. అక్టోబర్ 30న ఇద్దరూ ఏడడుగులు వేశారు. ఇక కాజల్ పెళ్లి కథ వెనక ఉన్న సీక్రెట్స్ మీ కోసం.
కాజల్ అగర్వాల్‌ది, బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లుది చాలా మంది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకుంటున్నారు. కాదు... గౌతమ్, కాజల్ గత పదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. తెలిసిన స్నేహితుల ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ‘మేమిద్దరం చాలా ఏళ్ల నుంచి స్నేహితులమే’ అంటారు కాజల్. ఈ పదేళ్ల వాళ్ల రిలేషన్‌షిప్ గురించి చెబుతూ– ‘‘మూడేళ్లు మేమిద్దరం డేటింగ్ చేశాం. ఏడేళ్లు స్నేహితులుగా ఉన్నాం. స్నేహం పెరిగిన ప్రతి దశలో ఒకరికి ఒకరం చాలా ముఖ్యమైనవాళ్లం అయ్యాం. మా బంధాన్ని మరింత బలపరుచుకున్నాం’’ అన్నారు కాజల్.
కరోనా కలిపింది ఇద్దర్నీ
కరోనా ఎవర్నీ కలవనీకుండా చేసింది. కానీ కాజల్, గౌతమ్ మరింత దగ్గరవ్వడానికి, జీవితంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించడానికి ఉపయోగపడింది. ‘‘గడచిన పదేళ్లలో మేమిద్దరం తరచూ కలిసేవాళ్లం. స్నేహితుల పార్టీల్లోనో, ప్రొఫెషనల్‌గానో ఏదో విధంగా కలుస్తుండేవాళ్లం. కానీ కోవిడ్ వల్ల ఒకరిని ఒకరం కలవడం కుదర్లేదు. చాలా వారాల పాటు చూసుకునే వీలు కూడా లేకుండా అయింది. అప్పుడు అర్థం అయింది.. మేమిద్దరం ఒకరిని ఒకరం విడిచి ఉండలేం అని’’ అన్నారు కాజల్.
ప్రపోజల్ – నో డ్రామా
ప్రపోజ్ చేయడం అనగానే సినిమాల్లోలా అబ్బాయి మోకాళ్ల మీద నిలబడి అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా? అనే డ్రామా ఉంటుందని చాలామంది ఊహించుకుంటారు. కానీ కాజల్ విషయంలో అలాంటిది ఏం లేదట. అలాంటిది వద్దని కూడా అనుకున్నారట. ‘‘సినిమాల్లో అలాంటి ప్రపోజల్స్ చాలానే చూశాను. మళ్లీ రియల్ లైఫ్‌లోనూ అలాంటిది ఎందుకు అనిపించింది?’’ అన్నారామె. ‘‘గౌతమ్ మరీ సినిమాటిక్ కాదు. కానీ మా ప్రపోజల్ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగింది. తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నాడు. నాతో తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. నా జీవితాన్ని తనతో కాకుండా మరోలా ఊహించుకునే అవకాశమే లేదు అనిపించింది నాకు’’ అని పేర్కొన్నారు.
నిశ్చితార్థం
ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజల్ ఇంట్లోవాళ్లతో మాట్లాడటానికి వెళ్లారు గౌతమ్. కాజల్ కుటుంబ సభ్యులకు గౌతమ్ నచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకూ కాజల్ నచ్చారు. కట్ చేస్తే... అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జూన్‌లో ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక కోసం మనీష్ మల్హోత్రా డ్రెస్‌లు డిజైన్ చేశారు. ‘‘మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ మనీష్ మాకోసం తన స్టోర్ ఓపెన్ చేసి, మా డ్రెస్‌ను డిజైన్ చేశారు’’ అన్నారు కాజల్. పెళ్లి షాపింగ్ చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పదే పదే డిజైనర్‌ని కలవడానికి కుదరదు. అది మంచిది కూడా కాదు. అందుకే డ్రెస్‌ల దగ్గర నుంచి దాదాపు అన్నీ ఆన్‌లైన్‌లోనే చర్చించి, ఫిక్స్ చేసుకున్నారట కాజల్.
బ్యాచిలరెట్ పార్టీ
పెళ్లికి ముందు కాజల్ తన స్నేహితులందరికీ బ్యాచిలరెట్ పార్టీ ఇవ్వాలనుకున్నారు. ఈ ఈవెంట్‌ను కాజల్ సోదరి నిషా అగర్వాల్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ పార్టీని కాజల్ వాళ్ల ఇంట్లోనే చేసుకున్నారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారు
ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అని ప్లాన్ చేసుకున్నారట. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా కావాల్సిన వాళ్లందరూ సంగీత్‌లో డ్యాన్స్ చేయడం వంటివి చాలానే అనుకున్నారట. కానీ కోవిడ్ కారణంగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి ముఖ్యం. అలానే అందరి జాగ్రత్త కూడా ముఖ్యమే. అందుకే అతికొద్ది మంది మధ్య పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో పాల్గొన్న అతిథులు, వంటవాళ్లు.. ఇలా ప్రతీ ఒకరూ తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ తీసుకునేలా చూశారు. పెళ్లికి రాలేని బంధువులందరికీ గిఫ్ట్ బాక్స్‌లను పంపారట.
పెళ్లి సంబరాలు
అక్టోబర్ 28న పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. ఆ రోజు మెహందీ వేడుక నిర్వహించారు. ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ వీనా నగ్దా కాజల్‌కు మెహందీ వేశారు. అక్టోబర్ 29 ఉదయం హల్దీ ఫంక్షన్ జరిగింది. ఆ తర్వాత చున్నీ వేడుక చేశారు. ఇది పంజాబీ కుటుంబీకుల ఆచారం. వధువు అత్తామామలు వధువు తల మీద దుప్పట్టా వేసి తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్టు అన్నమాట. వధువు తన ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి వెళ్తున్నట్టు. వేడుకలన్నీ రెండువైపుల వారి ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తూ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కాజల్ అగర్వాల్‌కి నటిగా గుర్తింపు ఇచ్చింది సౌతిండియా. అందుకే జీలకర్ర బెల్లాన్ని కూడా తన పెళ్లిలో భాగం చేశారు. తెలిసినవారందరూ ఆన్‌లైన్‌లో, జూమ్‌లో చూస్తూ ఉండగా, అతికొద్ది మంది సమక్షంలో కాజల్, గౌతమ్ వివాహం జరిగింది.
ఇండస్ట్రీ మిత్రులందరి కోసం వచ్చే ఏడాది గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారట కాజల్. అలాగే కాబోయే వధువులకు ఓ మాట చెప్పారామె – ‘‘కీప్ కామ్, కీపిట్ పర్శనల్, ఎంజాయ్ ది మూమెంట్’’.
యస్... ఇప్పుడు కాజల్ ఎంతో ప్రశాంతంగా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో ఆ ఆనందం ఆమెలో స్పష్టంగా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment