ఎన్ని ప్రయోగాలు చేసినా తీరని కళాదాహం. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగాడు. అతి సామాన్యుడిలా ఒదిగాడు. అతనే భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు..కమల్ హాసన్. నవంబర్ 7 కమల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని చూద్దాం.
ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించాడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్నాడు. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. కమల్ హాసన్ వెండితెరపై అస్సలు కనిపించడు. అంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఆయన్ని చూస్తే కొత్తదనాన్ని చూసినట్టు ఉంటుంది.
1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు.
బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు.
1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్‌ను మలుపుతిప్పింది.
1978లో ‘మరో చరిత్ర’తో కమల్ చరిత్రే మారిపోయింది. ఇందులో కమల్, సరితలు చేసిన నటనకు.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది.
1983లో కమల్, శ్రీదేవి జంటగా బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘మూన్రాంపిరై ’బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని దాన్ని ‘వసంత కోకిల’గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం హిందీలో ‘సద్మా’గా రీమేక్ అయింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎంపికయ్యాడు.
మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘నాయకుడు’ మూవీలో నటనకుగాను రెండోసారి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాతో మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు.
ఆర్ట్ సినిమాలోని నాచురాలిటీ.. కమర్షియల్ సినిమాలోని సేలబులిటీ..రెండిటినీ మిక్స్ చేసి సరిహద్దు రేఖల్ని చెరిపేశాడు. సినిమా అంటే ఓ కళారూపం అన్న సత్యాన్ని తెలియజెప్పాడు. ప్రాంతాలు, భాషలు అనే అడ్డుగోడల్ని కూల్చేశాడు. సినిమా చుట్టూ అల్లిన లిల్లీపుట్ ఫార్మెట్ ను బద్ధలుకొట్టి..నిజమైన నాయకుడిగా నిలబడ్డాడు.. ఆ లోకనాయకుడు.
నాయకుడుగా నటించినా.. బ్రహ్మచారిగా కనిపించినా.. తెనాలిగా మెప్పించినా.. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నా.. అది కమల్‌కే చెల్లింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్.
అన్నీ అద్భుతాలే సాధిస్తే ఏమవుతుంది? అవార్డులు..రివార్డులూ వద్దన్నా చెంతకు చేరతాయి. అభినందనలు...ప్రశంసలూ వెతుక్కుంటూ వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు.
కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త్వరలో ’విక్రమ్’తో పాటు ‘భారతీయుడు 2’ చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment