తమిళసినిమా: కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన నాయకన్(తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 36 ఏళ్ల క్రితం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా నటి శరణ్య కథానాయకిగా పరిచయం అయ్యారు. జనకరాజ్, విజయం ఎంవీ వాసుదేవరావు, ఢిల్లీ గణేష్ తార నటించిన ఈ చిత్రంలో కమలహాసన్ వరదరాజన్ మొదలియార్ అనే ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అందులో ఆయన బాల్య దశ నుంచి చివరి వరకు కమలహాసన్ అద్భుతంగా నటించి మెప్పించారు. నాయకన్ చిత్రం కమలహాసన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ చిత్రంలోని నటనగాను ఆయన ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి ఉత్తమ కళాదర్శకుడుగా తోటతరణి ఉత్తమ ఎడిటర్‌గా బి.లెనిన్ జాతీయ అవార్డులను అందుకున్నారు.
అలాంటి నాయకన్ ఇప్పుడు మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీన్ని ఏటీఎల్ ప్రొడక్షన్ అధినేత మధురాట్ డిజిటల్ టెక్నాలజీతో కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 3న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కమలహాసన్ వీరాభిమానిగా ఈతరం ప్రేక్షకులు కూడా నాయకన్ చిత్రాన్ని చూడాలని తలంపుతో డిజిటల్ ఫార్మెట్లో రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై ఆరు వారాలపాటు ప్రదర్శింపబడి మంచి వసూళ్లను రాబట్టిందని చెప్పారు. కాగా నాయకన్ చిత్రం అంతకంటే మంచి వసూళ్లను రాబడుతుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్ చేతులమీదుగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాయకన్ చిత్రాన్ని తమిళనాడులోని 120 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment