బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘తలైవి’. ఇటీవలై విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జయలలితగా కంగనా నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా తన తదుపరి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది కంగనా. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా సాగే ‘సీత: ది ఇన్‌కార్నేషన్’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆమె తెలిపింది. ‘ఇలాంటి టాలెంటెడ్ టీంతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జై సీతారామ్’ అని ఆమె క్యాప్షన్ జత చేసింది.
పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సీత: ది ఇన్‌కార్నేషన్’కి స్క్రీన్ రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్ర కోసం మూవీ టీం మొదట కరీనా కపూర్‌ని సంప్రదించింది. కానీ బెబో ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమె బదులు కంగనాను ఫైనల్ చేసింది. కాగా ఎంతో పవిత్రమైన సీత పాత్ర చేయడానికి కంగనా ఒప్పుకోవడం ఆనందనిచ్చిందని దర్శకుడు మీడియాతో తెలిపాడు. ఈ మూవీ మనం పురాణాలను చూసే విధానాన్ని మార్చుతుందని అలౌకిక్ చెప్పాడు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment