
తమిళ సినిమా: వివాదాస్పద నటి అని కంగనా రనౌత్ మరోసారి నిరూపించారు. సినీ రాజకీయ నాయకులపై తనదైన బాణీలో విమర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ బాలీవుడ్ జాణ. తాజాగా ఈమె తమిళంలో టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి –2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పి.వాసు దసకత్వం వహించారు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం చైన్నె లోని ఒక స్టార్ హోటల్లో చిత్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో చిత్రం చంద్రముఖి– 2 అని చెప్పారు. తాను ఇంతకుముందు వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని చూశానని అందులో జ్యోతిక నటన చాలా నచ్చిందని చెప్పారు. ఆమె తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. అయితే ఆమెతో తనను పోల్చుకోరాదని, తాను నటించిన పాత్రే అసలైన చంద్రముఖి అని పేర్కొన్నారు. హారర్ర్, కామెడీ ఫ్యామిలీ అంటూ అన్ని అంశాలు కలిగిన చంద్రముఖి వంటి కలర్ ఫుల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.