‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ 'Chandramukhi 2' Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ

Published Thu, Sep 28 2023 5:07 PM | Last Updated on Sat, Sep 30 2023 11:19 AM

Chandramukhi 2 Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: చంద్రముఖి 2 
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు 
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌
నిర్మాత:సుబాస్కరన్‌
దర్శకుడు: పి.వాసు
సంగీతం: కీరవాణి
సినిమాటోగ్రఫీ:ఆర్డీ రాజశేఖర్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 28, 2023

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. చంద్రముఖిగా జ్యోతిక నటన చూసి చాలామంది భయపడ్డారు కూడా. ఇప్పటికీ చాలా మందికి బెస్ట్‌ హారర్ ఫిల్మ్‌ అంటే చంద్రముఖినే. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్‌ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి చంద్రముఖి 2పై హైప్‌ క్రియేట్‌ అయింది.  దానికి తోడు రజనీకాంత్‌ శిష్యుడు రాఘవ లారెన్స్‌ గురువుగారి పాత్ర పోషించడం.. బాలీవుడ్‌ క్వీన్‌ కంగన చంద్రముఖిగా అనేసరికి ‘చంద్రముఖి 2’పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురవారం(సెప్టెంబర్‌ 28) ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? చంద్రముఖిగా కంగన ఏమేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
రంగనాయకి(రాధిక శరత్‌కుమార్‌) ఫ్యామిలీకి అనుకోని ఆపదలు వచ్చిపడతాయి. దీంతో ఆమె స్వామీజీ(రావు రమేశ్‌)ని కలుస్తుంది. కులదైవం గుడిలో కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తే దోషాలన్నీ తొలిగిపోతాయని ఆయన చెబుతాడు. దీంతో తన అన్నదమ్ములు, వారి పిల్లలతో కలిసి వేటయపురం వెళ్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురి పిల్లలను కూడా పూజ కోసం తీసుకురావాల్సి వస్తుంది. ఆ పిల్లలకు సంరక్షకుడిగా ఉన్న మదన్‌(రాఘవ లారెన్స్‌) ఆ ఊరికి వెళ్తాడు. వారంతా చంద్రముఖి ఫ్యాలెస్‌లో దిగుతారు.

ఆ ఇంటి ఓనర్‌ బసవయ్య(వడివేలు) బిల్డింగ్ అంతా తిరిగి చూపించి, దక్షిణం వైపు మాత్రం వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ రంగనాయకి మేనకోడలు గాయత్రితో పాటు కొందరు దక్షిణం వైపు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చంద్రముఖి(కంగనా రనౌత్‌) నేపథ్యం ఏంటి? సెంగోటయ్య(లారెన్స్‌) వేటయ్యరాజుగా ఎలా మారాడు? వేటయ్యరాజుకి, చంద్రముఖికి మధ్య పగ ఏంటి? రంగనాయకి కుటుంబ సభ్యుల్లో చంద్రముఖి ఎవరిని ఆవహించింది? ఆమె నుంచి చంద్రముఖిని తొలగించడానికి స్వామిజీతో పాటు మదన్‌ చేసిన త్యాగమేంటి? చివరకు చంద్రముఖి ఆత్మ ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్లిపోయింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
కథ వినగానే మీ కళ్ల ముందు చంద్రముఖి సినిమా తిరిగింది కదా! అది నిజమే. సినిమా చూస్తున్నంత సేపు చంద్రముఖి చిత్రమే కనిపిస్తుంది. కేవలం పాత్రలు మారుతాయి అంతే. హీరో ఇంట్రడక్షన్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ప్రతిదీ చంద్రముఖి లాగే ఉంటుంది. ఒక ఫైట్‌ సీన్‌తో హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత ఫ్యాలెస్‌కు రావడం..అక్కడ అవమానాలు ఎదుర్కోవడం.. ప్యాలెస్‌ పక్కన ఉండే పేదింటి అమ్మాయిని హీరో ఇష్టపడడం.. సేమ్‌ టు సేమ్‌ చంద్రముఖి లాగే ఫస్టాఫ్‌ సాగుతుంది. అయితే కొత్తదనం ఏదైనా ఉందంటే..అది వేటయ్య ఆత్మను తీసుకురావడమే. 

రంగనాయకి కుటుంబానికి ఉన్న దోషం గురించి చెబుతూ సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత ఓ ఫైట్‌ సీన్‌తో హీరోని పరిచయం చేశాడు. రంగనాయకి ఫ్యామిలీ అంతా చంద్రముఖి ఫ్యాలెస్‌ చేరేవరకు కథ ఆసక్తిగా సాగుతుంది. ప్యాలెస్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి సీన్‌ ‘చంద్రముఖి’లాగే అనిపిస్తుంది. పైగా నెమ్మదిగా సాగుతూ బోర్‌ కొట్టిస్తుంది. వడివేలు కామెడీ వర్కౌట్‌ కాలేదు. చాలాచోట్ల ఆయన సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. మొదటి భాగంలోలాగే ఇందులో కూడా దొంగ బాబాగా మనోబాల ఎంట్రీ ఇస్తాడు. అయితే పార్ట్‌-1లో ఆ సీన్‌ బాగా నవ్విస్తుంది. కానీ ఇక్కడ చూస్తే.. నవ్వు రాకపోవడమే కాకుండా బోర్‌ కొడుతుంది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో చూపించే సీన్‌ ఒక్కటి కాస్త భయపెడుతుంది. ఇలా ఫస్టాఫ్‌ రొటీన్‌గా సాగుతుంది. 

ఇంటర్వెల్‌ తర్వాత కథంతా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. వేటయ్య రాజు పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. సెంగోటయ్య ఇచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది. చంద్రముఖి ప్రియుడు గుణశేఖర్‌ ప్యాలెస్‌లోకి రావడం.. అది వేటయ్య రాజు చూడడం.. ఇందతా పార్ట్‌ 1లో లాగే సాగుతుంది.  క్లైమాక్స్‌లో లారెన్స్‌, కంగనల మధ్య సాగే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ కూడా అచ్చం ‘చంద్రముఖి’లాగే ఉండడం విచిత్రం. ఇక చివర్లో పార్ట్‌ 3 ఉంటుందన్నట్లు చిన్న లీడ్‌ ఇచ్చి ముగింపు పలికారు. 

ఎవరెలా చేశారంటే.. 
చంద్రముఖి అనగానే మనకు రజనీకాంత్‌, జ్యోతిక పాత్రలు కళ్లముందు తిరుగుతాయి. అంతలా తమ పాత్రల్లో జీవించారు. లారెన్స్‌, కంగన ఆ స్థాయిలో మెప్పించకపోయినా.. ఉన్నంతలో న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. మదన్‌ లాంటి పాత్ర లారెన్స్‌ కు కొత్తేమి కాదు కానీ వేటయ్యరాజు తరహా పాత్రలో నటించడం మాత్రం తొలిసారి. అయినాసరే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక చంద్రముఖిగా కంగన ఒదిగిపోయింది. అయితే జ్యోతిక భయపెట్టినట్లుగా కంగన భయపెట్టలేకపోయింది. ఇది దర్శకుడి తప్పిదమనే చెప్పాలి. కైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్‌లో మాత్రం లారెన్స్‌తో పోటీపడి నటించింది. రంగనాయకిగా రాధికా శరత్‌కుమార్‌ పర్వాలేదనిపించింది. చంద్రముఖి ప్యాలెస్‌ ఓనర్‌ బసవయ్యగా వడివేలు నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. స్వామీజీగా రావు రమేశ్‌, చంద్రముఖి ఆవహించిన యువతి పాత్రలో నటించిన నటితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి ఈ  సినిమాకు సంగీతం అందించారంటే నమ్మశక్యం కాదు. పాటలతో పాటు బీజీఎం కూడా చాలా పూర్. ఒక్క సాంగ్ కూడా గుర్తుండేలా లేదు. సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్‌ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాప్‌లో చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సిందే. లైకా సంస్థ నిర్మాణ విలువు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement