కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు.
నటుడిపై దాడి
తిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.
న్యాయం కావాలి
తనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
నిందితుడు అరెస్ట్
చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్‌లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment