బెంగుళూరు : ప్రముఖ కన్నడ నటి ప్రతిమా దేవి(88) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. జగన్మోహిని, కృష్ణలీలా, చంచల ఉమరి, శివశరణే నమియక్క, మంగళ సూత్రం వంటి చిత్రాలతో ప్రతిమా దేవి పాపులర్ అయ్యింది. జగన్మోహిని సినిమాలో ప్రతిమా దేవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 1951లో విడుదలైన ఈ సినిమా కన్నడ నాట 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. 2011లో కర్ణాటక ప్రభుత్వం ప్రతిమా దేవిని లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది.
ప్రముఖ నటిగా కొనసాగుతున్న సమయంలోనే వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు శంకర్ సింగ్‌ను ప్రతిమా దేవి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ప్రతిమా దేవీ మృతిపై ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె చెరగని ముద్ర వేశారని, ఎంతో ప్రతిభావంతమైన నటిని పరిశ్రమ కోల్పోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment