Chaavu Kaburu Challaga Review, Rating | Karthikeya | Lavanya Tripathi | Bunny Vasu - Sakshi
Sakshi News home page

‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

Published Fri, Mar 19 2021 12:38 PM | Last Updated on Sat, Mar 20 2021 11:47 AM

Karthikeya Chaavu Kaburu Challaga Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : చావు కబురు చల్లగా
జానర్ : రొమాంటిక్‌ కామెడీ డ్రామా
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు
నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్‌
నిర్మాత : బన్నీవాసు
దర్శకత్వం : కౌశిక్ పెగ‌ళ్లపాటి
సంగీతం : జాక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా 
ఎడిటర్‌ : జీ సత్య
విడుదల తేది : మార్చి 19, 2021

'ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్‌ హీరో ఇటీవల చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ‘చావు కబురు చల్లగా..’ అనే వెరైటీ టైటిల్‌, కొత్త గెటప్‌తో శుక్రవారం (మార్చి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? తొలి ప్రయత్నంలో కౌశిక్ పెగ‌ళ్లపాటి ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం.

కథ
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్‌ కాల్‌ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. అయినప్పటకీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్‌ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు
బస్తీ బాలరాజు అనే ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కార్తికేయ ఒదిగిపోయాడు. చదువు సంద్యాలేక, బస్తీల్లో ఉండే యువకులు ఎలా ప్రవర్తిస్తారో బాలరాజు క్యారెక్టర్‌ గుర్తు చేస్తుంది. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. ఇక భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్‌ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో లావణ్య త్రిపాఠిని చూడొచ్చు. ఇక కార్తికేయ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఆమనిది. గంగమ్మ పాత్రలో ఆమె నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్‌ పాయింట్‌.  కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

విశ్లేషణ
చావు నుంచి తప్పించుకోలేమనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు.

సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో తల్లి మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉందో వివరించిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఎమోషనల్‌ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. జోక్స్, బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటర్‌ జీ సత్య తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటన
పాటలు
సెకండాఫ్‌ 

మైనస్‌ పాయింట్స్
స్క్రీన్‌ ప్లే
ఫస్టాఫ్‌
స్లోనేరేషన్‌
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement