murali sharma
-
Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించనున్నారు. ఈ 'చారి 111' ట్రైలర్ చివరలో 'వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా' అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. 'నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు' అంటూ 'వెన్నెల' కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. -
కామెడీ స్పై
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓ కన్ ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సెప్టెంబర్ 17న శ్రీనివాస్ రెడ్డి ' ప్లాన్ బి'
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో డింపుల్ హీరోయిన్గా నటిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర పాటలు అందించగా, శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. -
‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ
టైటిల్ : చావు కబురు చల్లగా జానర్ : రొమాంటిక్ కామెడీ డ్రామా నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాత : బన్నీవాసు దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి సంగీతం : జాక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా ఎడిటర్ : జీ సత్య విడుదల తేది : మార్చి 19, 2021 'ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘చావు కబురు చల్లగా..’ అనే వెరైటీ టైటిల్, కొత్త గెటప్‌తో శుక్రవారం (మార్చి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయను హిట్ ట్రాక్ ఎక్కించిందా? తొలి ప్రయత్నంలో కౌశిక్ పెగళ్లపాటి ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం. కథ బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. అయినప్పటకీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు బస్తీ బాలరాజు అనే ఊరమాస్ క్యారెక్టర్లో కార్తికేయ ఒదిగిపోయాడు. చదువు సంద్యాలేక, బస్తీల్లో ఉండే యువకులు ఎలా ప్రవర్తిస్తారో బాలరాజు క్యారెక్టర్ గుర్తు చేస్తుంది. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. ఇక భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో లావణ్య త్రిపాఠిని చూడొచ్చు. ఇక కార్తికేయ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఆమనిది. గంగమ్మ పాత్రలో ఆమె నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ చావు నుంచి తప్పించుకోలేమనేది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో తల్లి మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉందో వివరించిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. జోక్స్, బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటర్ జీ సత్య తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటన పాటలు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్లోనేరేషన్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఆ పబ్‌లో ఏం జరిగిందో తెలియాలి’
‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్’. ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అని ఇప్పటికే విడుదలై డైలాగ్ ప్రోమోలో హీరో విశ్వక్ సేన్ చిన్న క్లారిటీ ఇచ్చేశాడు. డైలాగ్ టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది. 127 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్లో ప్రీతి అనే అమ్మాయి కనిపించకపోవడం, ఆమె తల్లి దండ్రులు కంప్లెయింట్ ఇవ్వడం, స్పెషల్ ఆఫీసర్‌గా విక్రమ్ (విశ్వక్ సేన్) ఈ కేసు విచారించడం.. ఈ క్రమంలో యాక్షన్, సస్పెన్స్, లవ్ సీన్స్ ఇలా అన్ని అంశాలను ఈ ట్రైలర్లో జోడించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఓ సెక్షన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో హిట్ ట్రైలర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా విశ్వక్ సేన్ తన నటనతో రఫ్పాడించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. మురళీ శర్మ, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్ -
రావణలంక
మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి ‘రావణ లంక’ అనే టైటిల్ ఖరారు చేశారు. బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో క్రిష్ సమర్పణలో కె. సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బేనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రిష్, అస్మిత, త్రిష ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. ఉజ్జల్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హైలైట్. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
జీవితం భలే మారిపోయింది
‘‘తొలిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేశా. అందరూ ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. అలా ఎందుకంటారో ‘సాహో’ సినిమా చేసినప్పుడు తెలిసింది’’ అన్నారు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేసిన మురళీ శర్మ చెప్పిన విశేషాలు. ► ‘సాహో’ తొలిరోజు షూటింగ్ లంచ్‌టైమ్‌లో ‘ఇంటి భోజనం నాకు చాలా ఇష్టం’ అన్నాను. ఆ తర్వాత 60 రోజుల పాటు ప్రభాస్‌గారి ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. నాకే కాదు.. పదిమందికి సరిపడే పెద్ద క్యారియర్‌లో భోజనం వచ్చేది. గుత్తి వంకాయ కూర ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటల్లేవ్. నిజంగా ప్రభాస్ మంచి మనిషి.. యూనివర్సల్ డార్లింగ్. ► ‘భాగమతి’ సినిమా టైమ్‌లో సుజీత్ ‘సాహో’ కథ చెప్పాడు. తనది మంచి బ్రెయిన్. కథని అద్భుతంగా రాసుకున్నాడు. వంశీ, ప్రమోద్, విక్కీ చాలా ప్యాషనేట్ నిర్మాతలు. ఎప్పుడూ సెట్లో ఉండి సినిమా ఎలా వస్తోంది? ఏంటి? అని చూసుకునేవారు. యూవీ క్రియేషన్స్ నాకు హోమ్ బ్యానర్‌లాంటిది. ‘అభినేత్రి’ సినిమాకి మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు ‘సాహో’కి కూడా. ఓ సినిమాని ఒకేసారి పలు భాషల్లో చేయడం, డబ్బింగ్ చెప్పడం ఓ ప్రయోగం. ఏ భాషలో అయినా భావోద్వేగాలు ఒక్కటే.. భాష మాత్రం వేరు. ► ఏ సక్సెస్‌కి అయినా ప్రిపరేషన్ ముఖ్యం. నా పాత్రకి ముందుగానే నేను ప్రిపేర్ అవుతా. ఇటీవల ‘ఎవరు, రణరంగం’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేశా. ప్రతి పాత్రనీ ఎంజాయ్ చేస్తా. తండ్రి పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నా జీవితం మారిపోయింది. ► నేను పుట్టి, పెరిగింది ముంబైలో. మా అమ్మగారు తెలుగువారే. ‘అతిథి’ చిత్రంలో నాకు చాన్స్ వచ్చింది. బిగినింగ్‌లోనే మహేశ్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో, అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర చేస్తాననుకోలేదు. ‘మా అబ్బాయి కృష్ణగారి అబ్బాయి సినిమాలో చేస్తున్నాడు’ అని మా అమ్మ అందరికీ చెప్పుకున్నారు. తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ భాషలను మేనేజ్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. మారుతిగారితో ఓ చిత్రం చేశా. సందీప్ కిషన్–నాగేశ్వర్రెడ్డిగారి సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ‘అతిథి’ తర్వాత మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశా. -
వెలుగుతున్న క్యారెక్టర్లు
కొన్ని క్యారెక్టర్లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్లు కలర్ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ బ్రైట్ స్టోరీ. సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి దర్శక– నిర్మాతలు నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్ థౌజండ్ వాలా, హీరోయిన్ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు ఒక క్యారెక్టర్ తెచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరు. భూమిక చక్రం ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్’లో ఘోస్ట్ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. రావు రాకెట్ ‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్ డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్’ సినిమాలతో ఎట్రాక్ట్ చేసి, నటుడిగా రాకెట్ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. నవ్వుల మతాబు జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్ కామెడీ సినిమాలు నరేశ్ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్ అనే అనొచ్చు. ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్ ఓనర్ పాత్రలో నరేశ్ పేల్చిన నవ్వులకు థియేటర్ పకపకలాడింది. ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్ రంగ’, ‘దేవ దాస్’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చేసి ఆడియన్స్ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్. బిజీ బాంబ్ ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ. ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్ మీద పేల్చారు. జనవరి టు నవంబర్ సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది మా అమ్మ నా టార్చ్ బేరర్ ‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు.. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్ సీన్ అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్లోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ చేశాను. హరీష్ శంకర్ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. – రావు రమేశ్ డబుల్ సౌండ్ బాంబు హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్ సౌండ్ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్’ సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్’లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్ వల్ల ప్రత్యేకమైన వెకేషన్ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. – మురళీ శర్మ ఇంటింటా ఈశ్వరీ రజనీకాంత్.. హైడ్రోజన్ బాంబ్. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
నేనెవర్నీ ప్రేమించలేదు
‘‘బ్రాండ్ బాబు’ చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్యూర్ కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి చక్కటి ప్రేమ కథ కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి మా సినిమా హాయిగా చూడొచ్చు’’ అని కథానాయిక ఈషా రెబ్బా అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీ శర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైంది. నాకు, హీరోకి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? ప్రేమలో ఎదురయ్యే మిస్ అండర్స్టాండింగ్స్ ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాం? అన్నది ఆసక్తికరం. ఓ రకంగా చెప్పాలంటే కథ మొత్తం మారుతిగారి శైలిలోనే సాగుతుంది. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేశారు మారుతిగారు. సుమంత్ శైలేంద్ర కన్నడలో రెండు మూడు చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఇదే మొదటి చిత్రం. నా పాత్రలన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పా. ఇప్పటి వరకూ నేను ఎవర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌గారి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో, సుమంత్‌గారితో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
‘విజేత’ మూవీ రివ్యూ
టైటిల్ : విజేత జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్ సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్ దర్శకత్వం : రాకేష్ శశి నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా..? తొలి సినిమాతో కల్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్ ముందు విజేతగా నిలిచాడా..? కథ; రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. కానీ ఈ బాధ్యతలేవి పట్టని రామ్, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అల్లరి చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) రామ్ చేసిన ఓ పని కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్ చేసిన అల్లరి పనుల కారణంగా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా సహాయం చేయడు. చివరకు ఎలాగోలా తండ్రిని కాపాడుకున్న రామ్ ఎలాగైన జీవితంలో నిలబడాలనుకుంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్గా మాళవిక నాయర్ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్ ప్లస్ పాయింట్ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్, నోయల్, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ; మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్ శశి ఆ పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్ తనదైన టేకింగ్ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మలిచాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాల్లో రామ్ పాత్ర ఈ జనరేషన్ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్ చూపించాడు. సెంథిల్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. నిర్మాత సాయి కొర్రపాటి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; ఫస్ట్ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వచ్చే నెలలో విజేత
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్ కథనాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్లో కాలేజ్‌లో జరిగే ఇంటర్వ్యూల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాటలు మినహా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. సినిమాను జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. చిరంజీవిగారి అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. రాకేశ్ శశి బాగా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని పేర్కొంది చిత్రబృందం. తనికెళ్ల భరణి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
నేను పక్కా క్రిమినల్!
‘ఈ కైజర్ని చంపేవాడు ఇంకా పుట్టలేదు’ అంటూ ‘అతి«థి’ సినిమాతో ఉత్తమ విలన్ అనిపించుకున్నారు మురళీశర్మ. హిజ్రాగా నటించినా, ఒక పాత్ర కోసం గుండు కొట్టించుకున్నా...ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచే నాటకాల్లో నటించేవాడు మురళీశర్మ. ముంబైలోని ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్’ స్కూల్లో శిక్షణ పూర్తయిన తరువాత సహాయ దర్శకుడిగా పనిచేయడానికి దర్శకులను కలవడం మొదలుపెట్టాడు. నటన అంటే ఇష్టం ఉన్న శర్మ దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేయడానికి కారణం... సరిౖయెన పాత్రలు రాకపోవడమే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తక్కువ కాలంలోనే మనసు నటన వైపు లాగింది. వినోద్ పాండే ‘రిపోర్టర్’ అనే సీరియల్ తీస్తున్నాడు అని తెలుసుకొని ప్రయత్నిద్దామనుకున్నాడుగానీ, గతంలో వృథా అయిన ప్రయత్నాలు గుర్తుకు వచ్చి ‘ఇది జరిగే పనేనా’ అనుకున్నాడు. అందుకే పాండే ఇంటి అడ్రస్ కనుక్కొని సరాసరి వెళ్లి కలిశాడు. అలా ‘రిపోర్టర్’ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. తొలి అడుగు పడింది. అయినప్పటికీ... నాలుగు సంవత్సరాల స్ట్రగుల్ íపీరియడ్! అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. జీటీవి సీరియల్ ‘రిష్తే’లో రామ్‌కలీ అనే హిజ్రా పాత్రను పోషించాడు శర్మ. దీని కోసం ఎందరో హిజ్రాలను కలిసి మాట్లాడి వారి సాధకబాధకాలను అవగాహన చేసుకున్నాడు. శర్మలో మంచి నటుడు ఉన్నాడు అనే విషయం రామ్‌కలి పాత్ర ఇండస్ట్రీకి చెప్పకనే చెప్పింది. ‘డయల్ 100’ సీరియల్లో చేసిన పోలీసు పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ‘ధూప్’లో ఆర్మీ ఆఫీసర్, ‘మక్బూల్’లో సీనియర్ పోలీస్ ఆఫీసర్, ‘మై హూ నా’లో కెప్టెన్ ఖాన్‌గా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్న మురళీశర్మ హిందీ, ఇంగ్లిష్‌లతో సహా తెలుగు, తమిళ, మరాఠీ, గుజరాతీ భాషలు మాట్లాడగలరు.‘అతిథి’ సినిమాలో ‘కైజర్’గా తెలుగు తెరకు పరిచయం అయిన మురళీశర్మ పుట్టింది మన గుంటూరు జిల్లాలోనే! ‘కంత్రీ’ ‘ఊసరవెల్లి’ ‘మిస్టర్ నూకయ్య’ ‘కృష్ణం వందే జగద్గురుం’ ‘ఎవడు’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మురళీశర్మ ‘పట్టుదలే విజయానికి మూలం’ అనే మాటను బలంగా నమ్ముతారు. -
'ద్వారక' మూవీ రివ్యూ
టైటిల్ : ద్వారక జానర్ : కామెడీ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, పూజా జవేరి, 30 ఇయర్స్ పృద్వీ, మురళీ శర్మ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర నిర్మాత : సూపర్ గుడ్ ఫిలింస్, లెజెండ్ సినిమా పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ద్వారక. పెళ్లి చూపులు సక్సెస్ తరువాత విజయ్ రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఆ మార్పులు సినిమా సక్సెస్ కు ప్లస్ అయ్యాయా..? విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో అందుకున్న సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? కథ : గురుమూర్తి ( 30 ఇయర్స్ పృథ్వీ) హోమాలు పూజలు చేయించే ఆధ్యాత్మిక గురువు. తన శిష్యుడు నష్టాల్లో ఉండటంతో తనను ఆదుకోవడానికి ఓ మహాపురుషుడు వస్తాడని అతని రాకతో నీ జీవితం మారిపోతుందని చెప్తాడు. ఎర్ర శీను (విజయ్ దేవరకొండ) తన స్నేహితులతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అయితే ఈ సారి ఇలాంటి చిన్న దొంగతనం కాదు ఒకే సారి లైఫ్ సెటిల్ అయ్యే పని చేయాలని ఓ గుళ్లో దేవుడి విగ్రహాన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే హీరోయిన్ ను చూసి ఆగిపోతాడు. ఈ లోగా జనాలు వెంటపడటంతో పారి పోయే ప్రయత్నంలో గురుమూర్తి శిష్యుడి అపార్ట్మెంట్ లో దాక్కుంటాడు. ఎర్ర శీనును చూడగానే కోర్టు లో ఉన్న స్థలం సమస్య తీరిపోవటంతో అతనే తనను ఆదుకోవడానికి వచ్చిన దేవుడని ఫిక్స్ అయిపోతాడు గురుమూర్తి శిష్యుడు. ఎర్ర శీనును కృష్ణానంద స్వామి అంటూ అక్కడే ఆశ్రమం కట్టేస్తారు. కృష్ణానందస్వామి మహిమల గురించి విని జనం తండోపతండాలుగా వచ్చేస్తుంటారు, ఈ విషయం తెలిసిన క్రిమినల్ లాయర్ రవి( కాలకేయ ప్రభాకర్) కృష్ణానంద స్వామిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఎర్ర శీను గతం గురించి అందరికీ చెప్తానంటూ బెదిరించి, కృష్ణానందగా ఎర్ర శీనుకు మరింత పబ్లిసిటీ తీసుకువచ్చి ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కూడబెడతాడు. ఈ గొడవ లను తప్పించుకోవాలని ప్రయత్నించిన ఎర్రశీను తను గుళ్లో చూసిన అమ్మాయి ఆశ్రమంలో కనిపించటంతో అక్కడే ఉండిపోతాడు. అదే సమయంలో దొంగ బాబాల ఆటకట్టించే హేతువాది చైతన్య( మురళీ శర్మ) దృష్టి కృష్ణానంద స్వామి మీద పడుతుంది. ఎలాగైన కృష్ణనంద ముసుగు వెనక ఉన్న రహస్యం కనిపెట్టాలని ఆశ్రమంలో చేరుతాడు. మరి అనుకున్నట్టుగా చైతన్య కృష్ణానంద గుట్టు బయటపెట్టాడా..? ఎర్ర శీను తనను బెదిరిస్తున్న లాయర్ రవి నుంచి ఎలా బయట పడ్డాడు..? ఎర్ర శీను తను ప్రేమించిన అమ్మాయి వసుధను దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి మంచి నటన కనబరిచాడు. తన అనుభవానికి మించిన పాత్రే అయినా.. క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ పూజా జవేరి ఉన్నంతలో పరవాలేదనిపించింది. గురుమూర్తి పాత్రలో పృథ్వీ నవ్వులు పూయించాడు. అనవసరపు పంచ్ డైలాగ్ లకు పోకుండా హెల్దీ కామెడీతో మెప్పించాడు. పూర్తి స్థాయి విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్ తన పరిథి మేరకు బాగానే నటించాడు. కీలకమైన చైతన్య పాత్రలో మురళీ శర్మ సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో మురళీ శర్మ నటన సినిమా స్థాయిని పెంచింది. చిన్న పాత్రే అయినా ప్రకాష్ రాజ్ తన మార్క్ చూపించారు. సాంకేతిక నిపుణులు : ప్రజల నమ్మకాలను ఎలా వ్యాపారంగా మారుస్తున్నారో చూపిస్తూ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర రాసుకున్న కథ చాలా బాగుంది. రెండున్నర గంటలకు సరిపడా కథ వస్తువును తయారు చేసుకోవటంలో ఫెయిల్ అయిన దర్శకుడు తొలి భాగం అంతా అనవసరపు సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అయితే సినిమా స్లో అయినప్పుడు కామెడీతో కవర్ చేసిన దర్శకుడు మంచి మార్కులు సాధించాడు. ప్రతీ నాయక పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో క్లారిటీ మిస్ అయ్యింది. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు విజువల్ గా బాగున్నాయి. నేపథ్య సంగీతంతో మరోసారి తన మార్క్ చూపించాడు సాయి కార్తీక్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ క్యారెక్టర్ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ క్లైమాక్స్ సీన్స్ ద్వారక... నమ్మకంతో చేసిన ప్రయత్నం బాగానే ఉంది - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్