వెలుగుతున్న క్యారెక్టర్లు | Diwali special story about telugu character artists | Sakshi
Sakshi News home page

వెలుగుతున్న క్యారెక్టర్లు

Published Tue, Nov 6 2018 12:08 AM | Last Updated on Tue, Nov 6 2018 4:51 AM

Diwali special story about telugu character artists - Sakshi

కొన్ని క్యారెక్టర్‌లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్‌లు కలర్‌ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్‌ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్‌ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్‌ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ  బ్రైట్‌ స్టోరీ.

సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేయడానికి దర్శక– నిర్మాతలు  నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్‌ థౌజండ్‌ వాలా, హీరోయిన్‌ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు  ఒక క్యారెక్టర్‌ తెచ్చిన క్యారెక్టర్‌ ఆర్టిస్టులు వీరు. 

భూమిక చక్రం
‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్‌ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్‌ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్‌ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్‌ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్‌’లో ఘోస్ట్‌ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. 

రావు రాకెట్‌
‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్‌ డైలాగ్‌ పెద్ద హిట్‌. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్‌’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్‌’ సినిమాలతో ఎట్రాక్ట్‌ చేసి, నటుడిగా రాకెట్‌ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్‌ విలన్‌గా నటిస్తున్నారు.

నవ్వుల మతాబు
జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్‌. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్‌ కామెడీ సినిమాలు నరేశ్‌ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్‌ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్‌ గ్రాఫ్‌ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్‌ అనే అనొచ్చు.  ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్‌ ఓనర్‌ పాత్రలో నరేశ్‌ పేల్చిన నవ్వులకు థియేటర్‌ పకపకలాడింది.  ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్‌ రంగ’, ‘దేవ దాస్‌’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌ చేసి ఆడియన్స్‌ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్‌.

బిజీ బాంబ్‌
ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్‌ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ.  ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్‌ మీద పేల్చారు. జనవరి టు నవంబర్‌  సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్‌’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు.
– ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది


మా అమ్మ నా టార్చ్‌ బేరర్‌
‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు..  ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్‌ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్‌ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్‌ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్‌ సీన్‌  అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్‌లోని డైలాగ్‌ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్‌ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్‌ చేశాను. హరీష్‌ శంకర్‌ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. 
– రావు రమేశ్‌

డబుల్‌  సౌండ్‌ బాంబు 
హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్‌ సౌండ్‌ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్‌’  సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్‌’లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది.

హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను
ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్‌ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్‌ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్‌ వల్ల ప్రత్యేకమైన వెకేషన్‌ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్‌ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను.
– మురళీ శర్మ

ఇంటింటా ఈశ్వరీ
రజనీకాంత్‌.. హైడ్రోజన్‌ బాంబ్‌. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్‌ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్‌ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్‌ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్‌ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్‌ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement