Vijetha Movie Review, in Telugu | 2018 | ‘విజేత’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 12:33 PM | Last Updated on Thu, Jul 12 2018 2:03 PM

Vijetha Telugu Movie Review - Sakshi

టైటిల్ : విజేత
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌
సంగీతం : హర్షవర్దన్‌ రామేశ్వర్‌
దర్శకత్వం : రాకేష్‌ శశి
నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్‌ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్‌ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్‌ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా..? తొలి సినిమాతో కల్యాణ్ దేవ్‌ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్‌ ముందు విజేతగా నిలిచాడా..?
 

కథ;
రామ్‌ (కల్యాణ్‌ దేవ్‌) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్‌ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్‌ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. కానీ ఈ బాధ్యతలేవి పట్టని రామ్‌, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అల్లరి చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్‌) రామ్‌ చేసిన ఓ పని కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్‌ చేసిన అల్లరి పనుల కారణంగా సమయానికి అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా సహాయం చేయడు. చివరకు ఎలాగోలా తండ్రిని కాపాడుకున్న రామ్‌ ఎలాగైన జీవితంలో నిలబడాలనుకుంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్‌ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్‌ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్‌ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్‌ ప్లస్ పాయింట్‌ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్‌)ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.


విశ్లేషణ ;
మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్‌ శశి ఆ పనిని సమర్ధవం‍తంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్‌ తనదైన టేకింగ్‌ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్‌ డ్రామాగా మలిచాడు. (సాక్షి రివ్యూస్‌)చాలా సన్నివేశాల్లో రామ్‌ పాత్ర ఈ జనరేషన్‌ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్‌ చూపించాడు. సెంథిల్‌ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. నిర్మాత సాయి కొర్రపాటి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేశారు. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్‌ అయ్యింది. ఆర్ట్‌, ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్‌ పాయింట్స్‌ ;
తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌
క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.
                

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement