మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 2015లో జతకలిసే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాకేష్ శశి డైరెక్షన్‌లో ‘విజేత’ సినిమాతో కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజేత సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు రాకేష్ శశి మీడియాతో పంచుకున్నారు.
- తొలిచిత్రం ‘జతకలిసే’ సమయంలోనే సాయి కొర్రపాటి గారితో పరిచయం ఏర్పడింది. అప్పడే వారాహి చలనచిత్రం బ్యానర్‌లో సినిమా చేయాలన్నారు. ఈ లోగా సాయి గారు ఇతర సినిమాల్లో బిజీ కావటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఫైనల్‌గా మూడేళ్ల తరువాత విజేతతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
- విజేత, కల్యాణ్ దేవ్ కోసం రాసుకున్న కథ కాదు. ముందే కథ తయారు చేసుకున్నాం. హీరో కోసం వెతుకుతున్న సమయంలో వైజాగ్ సత్యానంద్ గారి ద్వారా కల్యాణ్ గురించి తెలిసింది. కల్యాణ్‌ను మా సినిమా ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. కల్యాణ్ రిచ్ ఫ్యామిలీలో పెరిగారు. మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం చాలా హోం వర్క్ చేశారు.
- సినిమా కథ.. టీజర్, ట్రైలర్‌లలో చూపించినట్టుగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుంది. అంతేకాదు మధ‍్య తరగతి కుటుంబాల్లోని అనుబంధాలు, ప్రేమలు, కష్టాలు, సర్థుబాట్లు అన్నిచూపించాం. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంతో విజేత కనెక్ట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం.
- శ్రీనివాస రావు అనే ఫ్యాక్టరీ ఎంప్లాయ్ ఆయన కొడుకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి రామ్‌ల మధ్య జరిగే కథే విజేత. తండ్రి ఆశయం నిలబెట్టే కొడుకు కథ ఇది. అయితే గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా విజేత కొత్తగా అనిపిస్తుంది. సమాజంలోని 90 శాతం మంది జీవితాలను మా సినిమా ప్రతిభింబిస్తుంది. ఓ గొప్ప వ్యక్తి గెలుపు కన్నా, సామాన్యుడి విజయాన్ని ప్రేక్షకుల ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సామాన్యుడి కథే విజేత. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశాం.
- కల్యాణ్ తో సినిమా అనుకున్న తరువాత సాయి గారితో కలిసి చిరంజీవి గారికి కథ వినిపించాం. పూర్తి స్క్రిప్ట్ (స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో సహా) విన్న తరువాతే చిరంజీవి గారు ఓకె చెప్పారు. ఆ తరువాతే సినిమా మొదలైంది. టైటిల్ తప్ప చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన అంశాలేవి విజేతలో కనిపించవు. ఇది పూర్తిగా కల్యాణ్ సినిమాలాగే ఉంటుంది. చిరంజీవి గారికి కథ వినిపించాలన్న కోరిక ఉండేది. ఆయనతో సినిమా చేయకపోయినా.. నా రెండో సినిమాకే ఆయనకు కథ వినిపించే అవకాశం రావటం ఆనందంగా ఉంది.
- గత చిత్రాల్లో మాళవిక నటన నాకు చాలా బాగా నచ్చింది. విజేతలో హీరోయిన్ పాత్రకు ఆమె అయితే పర్ఫెక్ట్ అన్న నమ్మకంతో ఆమెను సెలెక్ట్ చేసుకున్నాం. మా నమ్మకాన్ని మాళవిక నిలబెట్టారు. సినిమాలో ఆమె స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తారు.
- నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 12 ఏళ్ల వయసుల్లో మా ఫాదర్ చనిపోయారు. చిన్నతనంలో ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుక మేం చాలా కష్టపడ్డాం. అలాంటి సందర్భాలు సినిమాలో ప్రతిభింబిస్తాయి. పూర్తిగా అదే నేపథ్యం మాత్రం కాదు. తరుపరి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం విజేత రిలీజ్, రిజల్ట్‌కోసం ఎదురు చూస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment