'ద్వారక' మూవీ రివ్యూ | Dwaraka Movie Review | Sakshi
Sakshi News home page

'ద్వారక' మూవీ రివ్యూ

Published Fri, Mar 3 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

Dwaraka Movie Review

టైటిల్ : ద్వారక
జానర్ : కామెడీ డ్రామా
తారాగణం : విజయ్ దేవరకొండ, పూజా జవేరి, 30 ఇయర్స్ పృద్వీ, మురళీ శర్మ
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర
నిర్మాత : సూపర్ గుడ్ ఫిలింస్, లెజెండ్ సినిమా

పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ద్వారక. పెళ్లి చూపులు సక్సెస్ తరువాత విజయ్ రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఆ మార్పులు సినిమా సక్సెస్ కు ప్లస్ అయ్యాయా..? విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో అందుకున్న సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..?

కథ :
గురుమూర్తి ( 30 ఇయర్స్ పృథ్వీ) హోమాలు పూజలు చేయించే ఆధ్యాత్మిక గురువు. తన శిష్యుడు నష్టాల్లో ఉండటంతో తనను ఆదుకోవడానికి ఓ మహాపురుషుడు వస్తాడని అతని రాకతో నీ జీవితం మారిపోతుందని చెప్తాడు. ఎర్ర శీను (విజయ్ దేవరకొండ) తన స్నేహితులతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అయితే ఈ సారి ఇలాంటి చిన్న దొంగతనం కాదు ఒకే సారి లైఫ్ సెటిల్ అయ్యే పని చేయాలని ఓ గుళ్లో దేవుడి విగ్రహాన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే హీరోయిన్ ను చూసి ఆగిపోతాడు. ఈ లోగా జనాలు వెంటపడటంతో పారి పోయే ప్రయత్నంలో గురుమూర్తి శిష్యుడి అపార్ట్మెంట్ లో దాక్కుంటాడు. ఎర్ర శీనును చూడగానే కోర్టు లో ఉన్న స్థలం సమస్య తీరిపోవటంతో అతనే తనను ఆదుకోవడానికి వచ్చిన దేవుడని ఫిక్స్ అయిపోతాడు గురుమూర్తి శిష్యుడు. ఎర్ర శీనును కృష్ణానంద స్వామి అంటూ అక్కడే ఆశ్రమం కట్టేస్తారు.

కృష్ణానందస్వామి మహిమల గురించి విని జనం తండోపతండాలుగా వచ్చేస్తుంటారు, ఈ విషయం తెలిసిన క్రిమినల్ లాయర్ రవి( కాలకేయ ప్రభాకర్) కృష్ణానంద స్వామిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఎర్ర శీను గతం గురించి అందరికీ చెప్తానంటూ బెదిరించి, కృష్ణానందగా ఎర్ర శీనుకు మరింత పబ్లిసిటీ తీసుకువచ్చి ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కూడబెడతాడు. ఈ గొడవ లను తప్పించుకోవాలని ప్రయత్నించిన ఎర్రశీను తను గుళ్లో చూసిన అమ్మాయి ఆశ్రమంలో కనిపించటంతో అక్కడే ఉండిపోతాడు. అదే సమయంలో దొంగ బాబాల ఆటకట్టించే హేతువాది చైతన్య( మురళీ శర్మ) దృష్టి కృష్ణానంద స్వామి మీద పడుతుంది. ఎలాగైన కృష్ణనంద ముసుగు వెనక ఉన్న రహస్యం కనిపెట్టాలని ఆశ్రమంలో చేరుతాడు. మరి అనుకున్నట్టుగా చైతన్య కృష్ణానంద గుట్టు బయటపెట్టాడా..? ఎర్ర శీను తనను బెదిరిస్తున్న లాయర్ రవి నుంచి ఎలా బయట పడ్డాడు..? ఎర్ర శీను తను ప్రేమించిన అమ్మాయి వసుధను దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి మంచి నటన కనబరిచాడు. తన అనుభవానికి మించిన పాత్రే అయినా.. క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ పూజా జవేరి ఉన్నంతలో పరవాలేదనిపించింది. గురుమూర్తి పాత్రలో పృథ్వీ నవ్వులు పూయించాడు. అనవసరపు పంచ్ డైలాగ్ లకు పోకుండా హెల్దీ కామెడీతో మెప్పించాడు. పూర్తి స్థాయి విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్ తన పరిథి మేరకు బాగానే నటించాడు. కీలకమైన చైతన్య పాత్రలో మురళీ శర్మ సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో మురళీ శర్మ నటన సినిమా స్థాయిని పెంచింది. చిన్న పాత్రే అయినా ప్రకాష్ రాజ్ తన మార్క్ చూపించారు.

సాంకేతిక నిపుణులు :
ప్రజల నమ్మకాలను ఎలా వ్యాపారంగా మారుస్తున్నారో చూపిస్తూ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర రాసుకున్న కథ చాలా బాగుంది. రెండున్నర గంటలకు సరిపడా కథ వస్తువును తయారు చేసుకోవటంలో ఫెయిల్ అయిన దర్శకుడు తొలి భాగం అంతా అనవసరపు సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అయితే సినిమా స్లో అయినప్పుడు కామెడీతో కవర్ చేసిన దర్శకుడు మంచి మార్కులు సాధించాడు. ప్రతీ నాయక పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో క్లారిటీ మిస్ అయ్యింది. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు విజువల్ గా బాగున్నాయి. నేపథ్య సంగీతంతో మరోసారి తన మార్క్ చూపించాడు సాయి కార్తీక్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కామెడీ
మురళీ శర్మ క్యారెక్టర్
ప్రీ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
క్లైమాక్స్ సీన్స్

ద్వారక... నమ్మకంతో చేసిన ప్రయత్నం బాగానే ఉంది

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement