కొందరు హీరోలు పైసా తక్కువైతే చాలు ప్రాణం పోయినట్లు ఫీలవుతారు. మరికొందరు నిర్మాతల పరిస్థితిని, సినిమా రిజల్ట్‌ను బట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హీరో కార్తీక్ ఆర్యన్ రెండో రకానికి చెందినవాడు. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సదరు సినిమాకు పని చేసే టెక్నీషియన్స్‌కు ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని ఈ మధ్య బాలీవుడ్‌లో ఓ చర్చ నడుస్తోంది.
తడిసి మోపెడవుతున్న బడ్జెట్
హీరోల పారితోషికానికి తోడు.. వారి మేకప్‌మెన్‌కు, హెయిర్ డ్రెస్సర్‌కు, స్టైలిస్ట్‌కు.. ఇలా తన దగ్గర పనిచేసే అందరికీ జీతాలివ్వాలని సరికొత్త డిమాండ్లు పెడుతుండటంతో బడ్జెట్ మితిమీరిపోతోందన్నది ప్రధాన అంశం. తాజాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. ఈ చర్చ జరగకముందు నేను షెహజాదా సినిమా చేశాను. చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నా ఫీజు వదిలేసుకున్నాను. రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేనూ ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు.
హీరోల త్యాగం చూడరే!
నేనే కాదు, చాలామంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. దర్శకుడు, యాక్టర్స్, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే ఆలోచిస్తారు. ఎవరూ దాన్ని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకైతే నా డబ్బులు నాకు ముట్టాల్సిందే అని ఎవరూ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు.
అల వైకుంఠపురములో రీమేక్
కాగా అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్‌గా షెహజాదా తెరకెక్కింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.
చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment