ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్ కుమార్ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు.
(చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)
తీసుకున్న పాయింట్ సీరియస్ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్‌విళి పాండియన్ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్. భాస్కర్ ఇమిడియారు.
(చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)
ఇక కథాంశానికొస్తే... కయల్‌విళి పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్‌విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే.
అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్ ప్రమోషన్ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్‌విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment