టైటిల్: సత్యం సుందరం
నటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకత్వం: ప్రేమ్ కుమార్
సంగీతం: గోవింద్ వసంత్
విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024
ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్‌లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే...
ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు.
(చదవండి: దేవర మూవీ రివ్యూ)
ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.
సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు.
వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్‌ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్: 3.25/5
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment