రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ విడుదలైన సమయం నుంచి పలు వివాదాలు వచ్చాయి. అయితే, తాజాగా కీర్తి వాటికి వివరణ ఇచ్చారు.
జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని 'రఘుతాత' సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా కనిపిస్తోంది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. 'ఇది చాలా సంతోషకరమైన సమయం. దర్శకుడు కథ చెబుతూ చాలా చోట్ల నవ్వించాడు. హోంబలే ప్రొడక్షన్స్ వారు తమిళ చిత్రాలను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. రఘు తాత చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తూ.. హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడమేంటి అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు. కానీ, హిందీని ఉద్దేశపూర్వకంగా ఒకరిపై విధించడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రం అని నేను చెప్పగలను.
వివాదాస్పదం కాకుండా నవ్వించగలిగే మెయిన్ స్ట్రీమ్ సినిమా అవుతుంది. రఘుతాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం. సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. ఇందులో రాజకీయపరమైన వివాదాలు అంటూ ఏమీ లేవు. పూర్తిగా కామెడీ సినిమా మాత్రమే.. ఇందులో పనిచేసిన నటీనటులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment