తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్‌కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్ హీరోయిజాన్ని చూపించారట.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్‌గుర్తు చేసుకున్నారు.
పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్ తాజాగా జయంరవి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సైరన్ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment