సౌత్ హీరోయిన్లకు ఓ కోరిక ఉంటుంది. ఎప్పటికైనా బాలీవుడ్‌లో రాణించాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఇక్కడ ఓ నాలుగైదు హిట్స్ పడగానే.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బారులు తీస్తారు. అక్కడ డెబ్యూ మూవీ హిట్ అయితే చాన్స్‌లు వస్తాయి. కానీ తొలి సినిమానే ప్లాప్ అయితే మాత్రం అంతే సంగతి. పైగా ఆ సినిమా కోసం సౌత్ సినిమాలను వదులుకోవడం..ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా బాలీవుడ్‌లో బీజీ అవుతుందేమోనని వేరే హీరోయిన్‌ని వెతుక్కోవడంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారుతారు. గతంలో త్రిష, కాజల్, శ్రియ, తమన్నా, పూజా హెగ్డే లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కీర్తి సురేశ్(Keerthy Suresh) కూడా చేరబోతున్నారు. ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్(Baby John) ఇటీవల విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
వరుణ్ ధావన్(varu Dhawan) హీరోగా నటించిన ఈ చిత్రం.. విజయ్ తేరి సినిమాకు హిందీ రీమేక్. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..తొలి రోజే ప్లాప్ టాక్‌ని తెచ్చుకొని కీర్తి సురేశ్ బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలు చేసింది.
అంతేకాదు బాలీవుడ్‌లో ఘోర అవమానం కూడా ఎదురైంది. సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్‌లో కెమెరామెన్లు ఆమె పేరు కూడా మర్చిపోయారు. కీర్తి సురేశ్‌కు బదులు కృతి ఇటు చూడు అంటూ ఫోటోలు తీశారు. దీంతో కాస్త అసహనానికి గురైన కీర్తి.. ‘నా పేరు కృతి కాదు..కీర్తి..కీర్తి సురేశ్’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. జాతీయ అవార్డు గ్రహిత, దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేశ్ పేరు కూడా బాలీవుడ్‌కు తెలియకపోవడం దారుణం అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment