'కేజీఎఫ్ 2' సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది రవీనా టండన్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రవీనా టండన్‌కు అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదట. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఆమె నటిని కావాలని ఎప్పుడూ అనుకోనేలేదట. తాజాగా ఆమె తన సినీ ఎంట్రీ ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది. మీరు నమ్ముతారో లేదో కానీ నేను చెప్పబోయేది నిజం. మొదట్లో నేను స్టూడియో ఫ్లోర్స్ తుడిచేదాన్ని. ఎవరైనా వాంతులు చేసుకుంటే నేను వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని.
ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాను. పదో తరగతి పూర్తి చేశాక అనుకుంటా.. ఇలాంటి పనులు చాలా చేశాను. చాలామంది నన్ను చూసి నువ్వు స్క్రీన్ ముందు ఉండాల్సినదానివి అనేవారు. ఆ మాటలు విని నేనా? నటిగా మారడామా? అస్సలు ఛాన్సే లేదు అని సమాధానం చెప్పేదాన్ని. నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అనుకోకుండా చివరకు నటిగా మారాను. ప్రహ్లాద్ దగ్గర పనిచేసినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో వెంటనే రవీనాను పిలవండి అనేవారు. మేకప్ వేసుకుని కొన్ని పోజులివ్వమని చెప్పేవారు.
ఇలా పదేపదే ఈయనకు ఉచితంగా ఎందుకు మేకప్ వేసుకుని ఫొటోలకు పోజులివ్వాలని ఆలోచించాను, దీని ద్వారా నేనూ స్వయంగా డబ్బు సంపాదించొచ్చు కదా అనిపించింది. అలా మోడలింగ్ మొదలుపెట్టాను, ఆ వెంటనే సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ సినిమాల్లోకి రావడానికి నేను యాక్టింగ్, డ్యాన్సింగ్, డైలాగ్ డెలివరీకి సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నటిగా మారాకే ప్రతీది నేర్చుకుంటూ పోయాను అని తెలిపింది. కాగా రవీనా టండన్ 1991లో పత్తర్ కే ఫూల్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలతో రవీనా టండన్ తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది.
Comments
Please login to add a commentAdd a comment