కర్ణాటకలోని స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఫోన్ పే సంస్థపై బహిష్కరణ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు చేస్తున్న పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కర్ణాటకలో ఉండే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే, దీనిని పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుబట్టారు. దీంతో అక్కడి ప్రజల నుంచి ఫోన్ పే పట్ల తీవ్రమైన వ్యతిరేఖత వచ్చింది.
నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడ వినియోగదారులు డబ్బును పంపుతున్న సమయంలో 'థ్యాంక్యూ బాస్' అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడ ప్రజలు ఫైర అవుతున్నారు. ఈ నేపథ్యంలో కిచ్చ సుదీప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనను ఆదరించిన కన్నడిగుల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. కన్నడిగులకు క్షమాపణలు చెప్పకుంటే ఫోన్ పే సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుదీప్ రేపు అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
తమ ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ క్యాంపెయిన్‌ను అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు సపోర్ట్ చేసేందుకు సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం అందుతోంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను చాలా మంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమైంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ మొదటగా వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతోంది.
రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడి పరిశ్రమవర్గాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలించి రానున్న రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment