టైటిల్ : మాక్స్
నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు
నిర్మాత: కలైపులి ఎస్. థాను
దర్శకత్వం: విజయ్ కార్తికేయ
సంగీతం: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్ర
ఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబు
విడుదల తేది: డిసెంబర్ 27, 2024
కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్‌లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.
మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.
సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.
పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు.
ఎవరెలా చేశారంటే..
కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది.
రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment