కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సుమారు 28 ఏళ్లుగా అక్కడ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా అందివచ్చిన డాక్టరేట్‌ను ఆయన కాదన్నారు. టాలీవుడ్‌లో ఈగ సినిమాతో ఇక్కడ వారికి బాగా దగ్గరయిన కిచ్చా సుదీప్ ఆ తర్వాత బాహుబలి సినిమాతో మెప్పించారు. దీంతో గతేడాది విడుదలైన విక్రాంత్ రోణా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆధరించారు.
వినోదం, నటనలో నటుడు కిచ్చా సుదీప్ చేసిన సేవలను కర్ణాటకలోని తుమకూరు విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. వీవీ సిండికేట్ సమావేశంలో జరిగిన ఈ చర్చను సుదీప్ పీఏ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సుదీప్ రిప్లై ఇచ్చారు. అయితే, అందివచ్చిన గౌరవాన్ని కిచ్చా సుదీప్ వదులుకున్నారు. యూనివర్శిటీ నిర్ణయం పట్ల సుదీప్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా చెప్పారు. 'సమాజానికి సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. నాకంటే కూడా వాళ్లే ఎక్కువ చేస్తున్నారు. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది. నాకు ఇంకా అంతటి స్థాయి రాలేదు అనుకుంటున్నాను.' అంటూ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవాన్ని సుదీప్ నిరాకరించారు.
యూనివర్సిటీ స్నాతకోత్సవ విలేకరుల సమావేశంలో తుమకూరు యూనివర్సిటీ ఛాన్సలర్ వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment