Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ | Kill Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Kill Review Telugu: నెవర్ బిఫోర్ యాక్షన్ మూవీ.. ఎలా ఉందంటే?

Published Wed, Jul 24 2024 1:44 PM | Last Updated on Wed, Jul 24 2024 2:33 PM

Kill Movie Review And Rating In Telugu

మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. 'కల్కి' రిలీజైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చిన హిందీ సినిమా 'కిల్'.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటిది థియేటర్లలో ఉండగానే ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం యూఎస్, యూకేలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ 'కిల్' ఎలా ఉందో తెలియాలంటే రివ్వ్యూ చదివేయండి.

కథేంటి?
అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్‌ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్‌ ఎక్కుతాడు. ఓ స్టేషన్‌లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.

ఎలా ఉందంటే?
నరకడం, పొడవడం, చంపడం.. కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకుని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే 'కిల్'. హాలీవుడ్‌లో 'జాన్ విక్' అని ఓ మూవీ సిరీస్.. హీరో, విలన్ గ్యాంగ్ ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీశారు. కథ చూస్తే కొత్తదేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ.. విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే 'కిల్'లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్.

ఈ సినిమా అంతా ట్రైన్‌లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరివరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజులో యాక్షన్, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్.. ఇద్దరు ఎన్ఎస్‌జీ కమాండోలు.. 40 మంది బందిపోట్లు.. వీళ్ల మధ్య జరిగే భీకర ఫైటింగ్. మొత్తం అంతా ఇదే. పస్టాఫ్‌లో హీరో.. విలన్ గ్యాంగ్‌ని చంపకుండా కేవలం కొట్టి కిందపడేస్తుంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి కృూరంగా మారిపోతాడు. పొడవడం, నరకడంలో విలన్ గ్యాంగ్‌కే చుక్కలు చూపిస్తాడు.

ఒంటి నిండా కత్తిపోట్లతో తోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్‌ని నామరూపాల్లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీ ఇదే ఫస్ట్ టైమ్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.

హీరో లక్ష‍్యకి ఇదే తొలి సినిమా గానీ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్‌లో ఫణి అనే పాత్ర చేసిన రాఘవ జూయల్ కూడా ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కనబెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ ఉంటాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. సినిమాటోగ్రాఫీ అయితే ఇంకా కేక. ట్రైన్ సెట్‌లో మూవీ తీసుండొచ్చు. కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచనే రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్‌లో చిక్కుకుపోయాం అనే రేంజులో భయపడతాం. ఫైనల్‌గా చెప్పాలంటే మీకు గుండె ధైర్యం ఎక్కువుంటే 'కిల్' చూడండి!

-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement