దసరా రేసు నుంచి తప్పుకున్న భారీ బడ్జెట్‌ చిత్రం.. ప్రకటించిన స్టార్‌ హీరో | Kollywood Star Hero Suriya Gives Clarity On Kanguva Release On Dasara, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Suriya: దసరా రేసు నుంచి కంగువా అవుట్‌.. ఆయనకు దారి ఇవ్వాల్సిందేనన్న సూర్య

Published Sun, Sep 1 2024 11:22 AM | Last Updated on Sun, Sep 1 2024 4:22 PM

kollywood Star Hero Suriya Gives Clarity On Kanguva Release On Dasara

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో  ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్‌ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ దసరాకు సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ఊహించని విధంగా రేసులోకి వచ్చేశాడు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం వేట్టైయాన్‌ కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీంతో ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య క్లాష్‌ ఏర్పడింది. ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలే రావడంతో కంగువా నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. దీంతో ఈ మూవీ వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి.

అందరూ అనుకున్నట్లుగానే కంగువాను వాయిదా వేస్తున్నట్లు హీరో సూర్య ప్రకటించారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తన సోదరుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' మూవీ ఆడియో లాంచ్‌లో క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అభిమానులు తనకు అండగా నిలవాలని సూర్య అభ్యర్థించారు. రజనీకాంత్ తన కంటే సీనియర్ అని.. అందుకే వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. 'తమిళ చిత్రసీమలో ఓ ప్రత్యేక చిత్రాన్ని అందించడం కోసమే రెండున్నరేళ్లకు పైగా కష్టపడ్డాం. దాదాపు 1000 మందికి పైగా కంగువా కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. రెండున్నరేళ్ల పాటు నటీనటులు, సిబ్బంది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. ఈ సినిమా కోసం మేము పడిన కష్టం వృథా కాదనేది నా గట్టి నమ్మకం. అక్టోబర్ 10న రజినీకాంత్ వెట్టైయాన్ కూడా వస్తోంది. ఆయన సినిమాకు మనం దారి ఇవ్వాలి. రజినీకాంత్‌ నాకంటే సీనియర్. 50 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు. ముందుగా సూపర్‌స్టార్‌ సినిమా వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయంలో మీరంతా నాతో ఉంటారని నమ్ముతున్నా. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement