కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకన్. కాయల్ పట్టికారన్( కాయల్‌పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్ థగ్స్ లైఫ్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్‌కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్‌సల్మాన్‌కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment